Site icon HashtagU Telugu

Fire Accident: రేణిగుంట ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. చిన్నారులు సహా ముగ్గురు మృతి

Fire Hospital

Fire Hospital

తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలతో పాటు డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. రేణిగుంట బిస్మిల్లా నగర్‌లోని కార్తీక క్లినిక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులతోపాటు డాక్టర్ ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటల ధాటికి ఊపిరాడకపోవడంతో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఇద్దరు మహిళల్ని సహాయక బృందాలు రక్షించాయి. తర్వాత డాక్టర్‌ రవి శంకర్ రెడ్డిని రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నించాయి. కానీ, ఆయన కూడా మరణించినట్లు తాజాగా పోలీసులు వెల్లడించారు.

రేణిగుంట పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలో డాక్టర్ రవిశంకర్ రెడ్డి కార్తికేయ ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. ఆసుపత్రి నడుస్తున్న భవనం పై అంతస్తులో వైద్యుని కుటుంబం నివసిస్తోంది. డాక్టర్ కుటుంబం నివాసం ఉంటున్న ఫ్లోర్‌లో ఈరోజు ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆస్పత్రిలో మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. డాక్టర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. ముందుగా ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే రవిశంకర్‌రెడ్డి భార్య, అత్తను కాపాడారు. సమాచారం అందుకున్న తిరుపతి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. వైద్యుడి కుమారుడు భరత్ (12), కూతురు కార్తీక (15)లను అతి కష్టం మీద పై అంతస్తు నుంచి కిందకు దించారు. వారిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులు కూడా మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.