Site icon HashtagU Telugu

Wild Mushrooms: పుట్టగొడుగులు తిని ముగ్గురు మృతి.. సినిమాను తలపిస్తున్న స్టోరి?

Wild Mushrooms

Wild Mushrooms

ఇటీవల ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని చిన్న పట్టణంలో గత జులై 29న అడవి పుట్టగొడుగులు తిని ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతుండగా ఈ కేసు స్థానికంగా కలకలం రేపింది. ఆస్ట్రేలియన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ఎలాంటి క్లూస్ దొరకడం లేదు. పోలీసులు ఆ ముగ్గురు ఎలా చనిపోయారనే దాని కారణాల కోసం వెతుకుతున్నారు. అదే రోజు ఇంట్లో వంట చేసిన మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది.

తరువాత ఆమెపై ఎటువంటి అభియోగాలు నమోదు చేయకుండా విడిచిపెట్టారు. కానీ ఆమె ప్రవర్తన పట్ల మాత్రం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విక్టోరియా రాష్ట్రంలోని లియోంగథా పట్టణంలో ఒక మహిళ జులై 29న తన 70 ఏళ్ల అత్తమామలైన గెయిల్, డాన్ ప్యాటర్‌సన్‌, భర్త ఇయాన్ విల్కిన్సన్, పిన్ని వరుస అయ్యే హీతర్ విల్కిన్సన్, పాస్టర్‌ను విందుకు ఆహ్వానించింది. భోజనం చేసిన వెంటనే, నలుగురు అతిథులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. గ్యాస్ట్రో అని మొదట భావించినందున ఆసుపత్రికి తరలించగా ఇక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మెల్బోర్న్‌లోని ఆసుపత్రికి బదిలీ చేయబడ్డారు. కానీ ఆస్పత్రిలో చేర్చినా లాభం లేకపోయింది.

ఆ ఆహారం తిన్న నలుగురిలో మహిళకు చెందిన అత్తామామలు గెయిల్, డాన్ ప్యాటర్‌సన్‌, వారి బంధువు హీతర్ విల్కిన్సన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భర్త ఇయాన్ విల్కిన్సన్, బాప్టిస్ట్ పాస్టర్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. స్థానికంగా కలకలం రేపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళను అదుపులోకి విచారణ చేశారు. అయితే, 48 ఏళ్ల మహిళ ఏమి జరిగిందనే దాని గురించి తనకు ఎలాంటి క్లూ లేదని, తన కుటుంబం పట్ల తనకున్న ప్రేమను నొక్కి చెప్పింది. వారిని బాధపెట్టే ఉద్దేశాన్ని తిరస్కరించింది.

హత్యానేరం కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం గురించి పోలీసులు తాజాగా మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లలు కూడా భోజనానికి హాజరయ్యారు. అయితే వారు అనారోగ్యంతో లేరు. వారు బాగానే ఉన్నారు . చనిపోయిన వారికి కాకుండా పిల్లలకు వేరే భోజనం వడ్డించారని పోలీసులు భావిస్తున్నారని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. చనిపోయిన వారు ఏ రకమైన పుట్టగొడుగులను తిన్నారో స్పష్టంగా తెలియదని అన్నారు. వారి మరణం వెనుక కుట్ర జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలియడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. అయితే ఈ కేసు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అంతేకాకుండా ఈ క్రైమ్ స్టోరీ సినిమా క్రైం స్టోరీ ని తలపిస్తోంది.