Voters List : తెలంగాణకు సంబంధించి సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలంగాణలో మొత్తం ఓటర్ల జాబితాను ప్రకటించారు. అధికారుల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,66,41,489 మంది పురుషులు కాగా.. 1,68,67,735 మంది మహిళలున్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,829 మంది ఉన్నారు.
ఈ మొత్తం ఓటర్లలో 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న ఓటర్లు 5,45,026 మంది కాగా, 85 ఏళ్లు దాటిన వృద్ధ ఓటర్ల సంఖ్య 2,22,091 గా ఉన్నది. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 3,591 మంది ఉన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులైన ఓటర్లు 5,26,993 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు ఉండగా.. భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.
ఇక, ఈ జాబితా విడుదలతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావడానికి పార్టీలన్నీ మరింత చురుగ్గా వ్యవహరించనున్నాయి. ఓటింగ్ హక్కు పట్ల అవగాహన పెంచుతూ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ గణాంకాలు పంచాయతీ ఎన్నికల అవసరాల కోసం ప్రత్యేకంగా సర్వే చేసి సేకరించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
Read Also: Bangladesh : షేక్ హసీనాపై బంగ్లాదేశ్ రెండో అరెస్టు వారెంట్ జారీ