Lagacharla Incident : లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను నాంపల్లి స్పెషల్ కోర్టు మంజూరు చేసింది. నరేందర్ రెడ్డి సహా 24 మంది రైతులకు కూడా బెయిల్ లభించింది. పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని, రైతులు రూ.20 వేల పూచీకత్తూ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో మొత్తం 26 మంది అరెస్ట్ కాగా 24 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని న్యాయవాది జక్కుల లక్ష్మణ్ తెలిపారు. ప్రతి బుధవారం పోలీస్ స్టేషన్ ముందుకు A1 మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.. A2 సురేష్ కు బెయిల్ మంజూరు కాలేదు. గురువారం నాడు సురేష్ బెయిల్ పై వాదనలు జరగనున్నాయి. 3 నెలల వరకు పోలీసులు దర్యాప్తుకు సహకరించాలని ఆదేశిస్తూ పిడిపిపి కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
కాగా, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులపై దాడి జరగడం తెలంగాణలో సంచలనంగా మారింది. అయితే దాడి ఘటనపై ఆ రోజు అర్ధరాత్రి నుంచే పోలీస్ యాక్షన్ ప్రారంభం అయింది. అర్ధరాత్రి వేళ.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేసి.. సుమారు 300 మంది పోలీసులు 55 మందిని పట్టుకొని బంధించారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో నవంబర్ 13వ తేదీన ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల రైతులకు బేడీలు అనే విషయం వివాదాస్పదమైంది. తెలంగాణ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.