Whales: నిస్సహాయంగా 230 తిమింగలాలు.. అసలేం జరిగిందంటే?

భూమి మీద ఇప్పటికే ఎన్నో రకాల జీవులు అంతరించిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ కొన్ని జీవులు

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 06:40 PM IST

భూమి మీద ఇప్పటికే ఎన్నో రకాల జీవులు అంతరించిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ కొన్ని జీవులు రోజురోజుకీ అంతరించిపోతున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది శాస్త్రవేత్తలు భూమిపై ఉన్న జీవరాశులను అంతరించిపోకుండా వాటిని కాపాడుకునేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో కొన్ని కొన్ని కారణాల వల్ల తక్కువగా ఉన్న జీవులే మరింత అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఘటన అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఆస్ట్రేలియాలోని టాస్మానియా తీరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 230 తిమింగలాలు నిస్సహాయంగా చిక్కుకుపోయాయి. మాక్వారీ ఓడరేవులో ఉన్న వీటిల్లో సగానికి పైగా ఇంకా జీవంతోనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో తిమింగలాలు తీరానికి కొట్టుకురావడానికి గల కారణం ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు. మంగళవారం టాస్మానియాలోని బాస్‌ జలసంధి వద్ద ఉన్న కింగ్స్‌ ద్వీపం సమీపంలో 14 తిమింగలాలు మృతి చెందగా, మరుసటిరోజే ఏకంగా 230 పైలట్‌ తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకురావడం ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది.

మామూలుగా సముద్రాలలో తిమింగలాలు గుంపులు గుంపులుగా నివసిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంటనే తిమింగలాలను రక్షించే బృందాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం మాక్వారీ ఓడరేవుకు తరలించింది. వీటిని రక్షించి సముద్రంలోకి చేర్చడం అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్‌ అని టాస్మానియా పర్యావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరొకసారి తీరం ఒడ్డుకు కొట్టుకు రావడంతో అక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఒకే రకమైన తిమింగలాలు ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో చిక్కుకు పోవడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.