Site icon HashtagU Telugu

Gujarat Fire Accident: గుజరాత్‌లోని గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 24 మంది మృతి

Gujarat Fire Accident

Gujarat Fire Accident

Gujarat Fire Accident: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ గేమింగ్ జోన్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాలుగు అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదంలో 20 మృతదేహాలను వెలికితీసినట్లు రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ ధృవీకరించారు. తదుపరి విచారణ కోసం ఆసుపత్రికి వెళ్లామని, విచారణ కొనసాగుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇక్కడ సంఘటన ప్రదేశంలో రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. కాగా గేమింగ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకి అని తేలింది. నిర్లక్ష్యం కారణంగానే ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్నారు. అయినప్పటికీ విచారణలో అసలు విషయాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రమాద ఘటనపై సీఎం స్పందించారు. క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించేందుకు ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు.రాజ్‌కోట్‌లోని గేమ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తక్షణ రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ల కోసం మున్సిపల్ కార్పొరేషన్ మరియు అధికారుల్ని ఆదేశించినట్లు సీఎం భూపేంద్ర పటేల్ ట్వీట్ చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియాను కూడా పటేల్ ప్రకటించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను కనిపెట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు అన్ని విధాలా సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Also Read: KTR: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల కోసం కేసీఆర్ నిరాహారదీక్ష చేశారు!