ప్రముఖ జాబ్ సెర్చ్ వెబ్‌సైట్ లింక్డ్ఇన్ (Linkedin) పై నెటిజన్లు మండిపడుతున్నారు. సంస్థ తన నిబంధనలు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ, లింక్డ్ఇన్ నెటిజన్ల ఆగ్రహానికి ఎందుకు గురైంది అంటే.. అందుకు కారణం ఓ 15ఏళ్ల కుర్రాడు. ఆ కుర్రాడు మామూలు వ్యక్తి కాదు. చిన్నవయస్సులో ఓ కంపెనీకి సీఈఓ అయ్యాడు. అతడే అమెరికాకు చెందిన ఎరిక్ జూ (Eric Zhu). అతడు పాఠశాల విద్య పూర్తిచేసుకున్న తరువాత ఏవియాటో సంస్థను స్థాపించాడు. వెంచర్ ఫండ్స్ కోసం అభివృద్ధి చేసిన అంకుర సెర్చ్ ఇంజిన్ ఇది.
ఎరిక్ జూ స్థాపించిన ఏవియాటో సంస్థలో అందరూ అతనికంటే పెద్దవాళ్లే పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల లింక్డ్ ఇన్ ఎరిక్ జూ ప్రొఫైల్‌ను నిషేదించింది. దీంతో కొందరు ఉద్యోగులు లింక్డ్ఇన్ లో మెస్సేజ్‌లు ఇస్తున్నారు. అయితే, వాటికి ఎరిక్ జూ రిప్లై పంపించలేని పరిస్థితి. దీంతో కొందరు ఉద్యోగులు నేరుగా సంప్రదించి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీంతో అసలు విషయాన్ని ఎరిక్ జూ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. లింక్డ్ఇన్ తన ప్రొఫైల్‌ను బ్లాక్ చేసింది. అందుకే మీ మెస్సేజ్‌లకు రిప్లై ఇవ్వలేక పోతున్నాను అని తెలిపాడు. దీంతో నెటిజన్లు లింక్డ్ఇన్‌పై మండిపడుతున్నారు.
లింక్డ్ఇన్ నిబంధనల ప్రకారం.. ప్రొఫైల్ నిర్వహించాలంటే 16ఏళ్లు ఉండాలి. అయితే, ఎరిక్ జూకు ప్రస్తుతం కేవలం 15ఏళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో లింక్డ్ ఇన్ అతడి ప్రొఫైల్‌ను తొలగించింది. గతంలోనూ స్పేస్ఎక్స్‌కు చెందిన 15ఏళ్ల ఇంజనీర్ ప్రొఫైల్‌ను ఇలానే తొలగించింది. అప్పుడు లింక్డ్ ఇన్ అనేక విమర్శలు ఎదుర్కొంది. తాజాగా ఎరిక్ జూ విషయంలో ఆ సంస్థ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. నిబంధనలు మార్చుకోవాలని సూచిస్తున్నారు.