Site icon HashtagU Telugu

Expensive Cooking Gas: వంటగ్యాసూ.. ‘పొయ్యొ’స్తా.. పేదోడి గుడ్ బై.. 8 ఏళ్లలో 144 శాతం పెరిగిన సిలిండర్ ధర!!

LPG Cylinders

14 Kg Lpg Gas Cylinder Price Today

వంటగ్యాస్ ధరల మంట పేదోడి జీవితాన్ని మరింత భారంగా మార్చుతోంది. మళ్లీ కట్టెల పొయ్యి వైపు కన్నేసే పరిస్థితిని సృష్టిస్తోంది. 2014 మార్చి 1న కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వంట గ్యాస్ ధర రూ.410 మాత్రమే.. ఇప్పుడది రూ.1,003 !! అంటే గత 8 ఏళ్లలో వంట గ్యాస్ ధర ఏకంగా 144 శాతం పెరిగింది. ఈమేరకు ధరలో పెరుగుదలను సంపన్నులు, అధిక ఆదాయ వర్గాలు భరించగలవు. కానీ పేద, మధ్యతరగతి వారికి అది పెనుభారమే.

” ప్రధానమంత్రి ఉజ్వల యోజన ” అనే పథకం ద్వారా ఆర్భాటంగా కేంద్ర ప్రభుత్వం ఎంతోమంది పేద కుటుంబాల మహిళకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. కానీ వంట గ్యాస్ ధరల నియంత్రణ విషయంలో చేతులు ఎత్తేసింది. ఫలితంగా ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న 90 లక్షల మందికిపైగా పేద కుటుంబాల మహిళలు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఒకసారి కూడా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోలేదంటూ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. 2021-22లో కేవలం ఒకే ఒక సిలిండర్ ను బుక్ చేసుకున్న కుటుంబాలు దేశంలో 1.08 కోట్లు ఉన్నాయని సమాచార హక్కు చట్టం దరఖాస్తులో సాక్షాత్తు పెట్రోలియం కంపెనీలు వెల్లడించాయి. 2020 మార్చి నాటికి మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఒక సగటు కుటుంబం దాని నెలవారీ సంపాదనలో 4.90 శాతం భాగాన్ని వంటగ్యాస్ సిలిండర్ కొనుగోలు కోసం వెచ్చించేది. 2022 ఏప్రిల్ వచ్చేసారికి ఇది కాస్తా 11 శాతానికి పెరగడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. ఇంతటి భారాన్ని మోయలేని వారంతా.. మళ్లీ గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి సాహసించలేదని సమాచారం. కేంద్ర, రాష్ట్రాల పన్నుల మోత, ఉక్రెయిన్ –
రష్యా యుద్ధం, ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అనేవి వంటగ్యాస్ ధరలు భారీగా పెరగడానికి దారితీశాయి. ఈ పెరుగుదల అనేది రాత్రికి రాత్రి జరిగింది కాదు. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికార పీఠం ఎక్కే సమయానికి కేవలం రూ.410 గా ఉన్న సిలిండర్ ధర .. క్రమక్రమంగా పెరుగుతూ రూ.1000 దాటింది. ఏ దశలోనూ ధర పెరగకుండా ఏం చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించిన దాఖలాలు లేనే లేవు.