Satavahana University : ‘శాతవాహన వర్శిటీ’కి 12-బి హోదా – ‘బండి సంజయ్’

శాతవాహన వర్శిటీకి 12-బి హోదా కలిపించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన విన్నపాలు ఎట్టకేలకు ఫలించాయి.

Published By: HashtagU Telugu Desk
Bandi Sanjay Satavahana Copy

Bandi Sanjay Satavahana Copy

శాతవాహన వర్శిటీకి 12-బి హోదా కలిపించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన విన్నపాలు ఎట్టకేలకు ఫలించాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు ఉన్నట్లుగానే శాతవాహనకు కూడా ఈ హోదా అందాలని ఆయన పలుమార్లు యూజీసీకి విన్నవించారు. ఇందులో భాగంగానే 2021 డిసెంబర్ 10న యుజిసి సెక్రటరీని కలిశారు. తాజాగా హోదాను కల్పిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని, దీనివల్ల భవిష్యత్తులో విశ్వవిద్యాలయాల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడిందని.. అప్పట్లో ఇక్కడి పరిస్థితిని వివరించడంతో పాటు ఖచ్చితంగా ఈ హోదాను అందించాలని కోరారు. ఇందుకు సంబంధించిన అంశాలు యూజీసీ కార్యదర్శి, సీవీవో రజ్నీష్ జైన్ కు సంజయ్ అప్పట్లో వివరించారు. శాతవాహన యూనివర్శిటీకి 12(బి) హోదా లేకపోవడంతో, యూనివర్శిటీలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆయన దృష్టికి సంజయ్ తీసుకెళ్లారు. విశ్వవిద్యాలయానికి కావాల్సిన నిధులు సమకూరడం లేదని పేర్కొన్నారు. మారిన నిబంధనలతో యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని, అందుకోసం వీలైనంత త్వరగా క్షేత్ర స్థాయికి బృందాలను పంపి పరిశీలించాలని విన్నవించారు. అంతేకాకుండా పలుమార్లు ఈ విషయమై సెక్రటరీ తో పాటు చైర్మన్, ఇతర అధికారులతో మాట్లాడి కరీంనగర్ కు ఈ హోదాను అందించేలా చొరవ చూపించారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చొరవ వల్ల 12-బి హొదా దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో శాతవాహన యూనివర్సిటీలో నెలకొన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయని అన్నారు. శాతవాహన వర్శిటీకి 12-బి హోదా కల్పించే విషయంలో తన వినతి మేరకు స్పందించిన యూజీసీ కార్యదర్శి రజ్నీష్ జైన్ కు, ఆ కమిటీకి విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. భవిష్యత్తులోనూ శాతవాహన యూనివర్సిటీకి అవసరమైన చేయూతని అందిస్తానని ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

  Last Updated: 23 Mar 2022, 10:34 PM IST