AP Assembly: జంగారెడ్డి గూడెం రగడ ..10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌..!

  • Written By:
  • Publish Date - March 16, 2022 / 11:28 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ స‌మావేశాలు ప్ర‌స్తుతం వాడి వేడిగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో స‌భ‌కు ప‌దే ప‌దే అంత‌రాయం క‌ల్గిస్తున్న క్ర‌మంలో వ‌రుస‌గా రెండో రోజు కూడా ప‌ది మంది టీడీపీ శాసనసభ్యులను స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం స్పెండ్ చేశారు. జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సభను తప్పు దారి పట్టించారంటు టీడీపీ స‌భ్యులు స్పీకర్‌ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు.

జంగారెడ్డి గూడెం మరణాలపై విచారణ జరపాలని, చర్చకు అనుమతించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేయ‌గా, టీడీపీ సభ్యులు అడిగిన వెంటనే చేయడానికి ఇది బహిరంగ సభ కాదని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్ర‌మంలో నిరసనలు తెలుపుతూ, సభలో తీవ్ర గందరగోళం సృష్టించ‌డంతో, సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని 10 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేల్లో రామ్మోహన్‌, భవాని, చినరాజప్ప, వెంకటనాయుడు, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, రవికుమార్‌, సాంబశివరావు, ప్రసాద్‌లు ఉన్నారు.