YouTube Village: ఈ గ్రామ విశిష్టత ఏంటో తెలుసా? మరియు అది ఎక్కడ ఉంది?

అది యూట్యూబర్ల ఊరు.. అక్కడ జనాభా 3000 మంది.. అయితే వారిలో 1,000 మంది యూట్యూబర్లు ఉన్నారు.. దీంతో ఆ ఊరి సర్పంచ్ కూడా యూట్యూబర్ల కు గ్రామ పంచాయతీ తరఫున..

YouTube Village : అది యూట్యూబర్ల ఊరు (YouTube Village).. అక్కడ జనాభా 3000 మంది.. అయితే వారిలో 1,000 మంది యూట్యూబర్లు ఉన్నారు.. దీంతో ఆ ఊరి సర్పంచ్ కూడా యూట్యూబర్ల కు గ్రామ పంచాయతీ తరఫున హెల్ప్ చేస్తున్నారు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం దేశమంతా చర్చకు కేంద్రమైన ఆ ఊరి పేరే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా నియోరా తహసీల్‌లోని తులసి గ్రామం. ఆ ఊరి సర్పంచ్ గులాబ్ యాదవ్ యూట్యూబర్ల కు వెన్నెముకగా ఉండి కంటెంట్ డెవలప్మెంట్ లో సహకరిస్తున్నారు. దీంతో ఈ గ్రామానికి చెందిన యూట్యూబర్లు దేశాన్ని , ప్రపంచాన్ని అలరించే కంటెంట్‌ని సృష్టిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం కూడా అంతంతే ఉండే తులసి గ్రామంలో యూట్యూబర్ల సమాచార విప్లవం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.

నాకు మొదట్లో అర్థం కాలేదు

గులాబ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. “గ్రామంలో అందరూ ఎందుకు వీడియోలు చేస్తున్నారో నాకు మొదట్లో అర్థం కాలేదు. మెల్లగా అన్నీ అర్ధం కావడం మొదలయ్యాయి. తర్వాత డబ్బు, కారు, లొకేషన్‌లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం. మేము శరీరం, మనస్సు, డబ్బుతో సాధ్యమైన అన్ని సహాయాలను వారికి అందించాము. ఈ రోజు, గ్రామంలోని ప్రతి మనిషి వయస్సుతో సంబంధం లేకుండా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు” అని చెప్పారు. కంటెంట్ క్రియేషన్ ఇప్పుడు పూర్తి సమయం వృత్తిగా మారినందున.. తులసి గ్రామ యూట్యూబర్లు దీన్ని అదనపు ఆదాయ వనరుగా మార్చుకున్నారు.

లెక్చరర్ కంటే ఎక్కువ శాలరీ..

కెమిస్ట్రీలో M.Sc చేసిన జై వర్మ ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేశాడు. అక్కడ అతను నెలకు 12,000-15,000 రూపాయలు సంపాదించాడు. కానీ Youtubeలో అతడికి ప్రతినెలా దాదాపు రూ.30,000 నుంచి రూ.35,000 వస్తున్నాయి. ఊరిలోని ఇలాంటి వారి అడుగుజాడలను అనుసరించి, ఇతరులు కూడా యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించారు.

అమ్మాయిలకూ ప్రోత్సాహం..

మహిళా కళాకారిణి పింకీ సాహు యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఏడాదిన్నర గడిచింది. ఇప్పుడు ఆమె దగ్గర దాదాపు 40 యూట్యూబ్ ఛానెల్‌లు ఉన్నాయి. ఊరిలోని అమ్మాయిలకు కూడా యూట్యూబర్లుగా మారడానికి బాగా ఎంకరేజ్మెంట్ లభిస్తోందని పింకీ చెప్పింది.

“బీయింగ్ ఛత్తీస్‌గర్హియా” సూపర్ హిట్

ఈ ఊరి నుంచి ప్రసారం అవుతున్న బీయింగ్ ఛత్తీస్‌గర్హియా అనే యూట్యూబ్ ఛానెల్‌ కు 115k పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ చానల్ 200కి పైగా కామెడీ వీడియోలను రూపొందించింది. వీళ్ళు కామెడీ వీడియోలతో ప్రజలను నవ్విస్తూ ముందుకు సాగుతున్నారు.

 

Also Read:  Gujarat Titans vs Chennai Super Kings: గుజరాత్ ఘనంగా… ఆరంభ మ్యాచ్‌లో చెన్నైకి నిరాశే