World Ozone Day : మన భూమి నుంచి 19 మైళ్ళ ఎత్తులో ఓజోన్ పొర ఉంది. ఇది భూమిపై నివసించే మానవాళి, ఇతర జీవరాశుల మనుగడకు ఎంతో కీలకం. ఓజోన్ అంటే.. 3 ఆక్సిజన్ పరమాణువులు కలిస్తే ఏర్పడే మూలకం. సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది. ఒకవేళ ఓజోన్ పొర అడ్డుగా లేకపోతే.. సూర్యుడి కిరణాలు నేరుగా మనుషుల మీద పడి చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను కలిగిస్తాయి. కాలుష్య ఉద్గారాలు, ఏసీ వాడకం వల్ల వెలువడే ఉద్గారాల కారణంగా ఓజోన్ పొర దెబ్బతింటోంది.
Also read : SIIMA Awards – Winners List : ‘సైమా’ టాలీవుడ్ అవార్డుల ఫుల్ లిస్ట్ ఇదిగో..
ఓజోన్ పొర క్షీణిస్తోందని 1982లో గుర్తించాక..
ఓజోన్ పొర క్షీణిస్తోందని పర్యావరణ శాస్త్రవేత్తలు 1982లో గుర్తించారు. ఇలాంటి పరిస్థితులే కొనసాగిస్తే భవిష్యత్తులో జీవకోటికి పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని గమనించిన ఐక్యరాజ్యసమితి, ఓజోన్ సంరక్షణ కోసం ప్రపంచ దేశాలను ఏకం చేసింది. తొలిసారిగా 1987లో 24 దేశాల ప్రతినిధులు కెనడాలోని మాంట్రియల్‌లో ఓజోన్ పొర క్షీణిస్తున్న భయంకరమైన పరిస్థితిపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఓజోన్ పొర రక్షణకు చేసిన తీర్మానాన్ని మాంట్రియల్ ప్రొటోకాల్ అంటారు. దీనిపై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1994 సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి. ఓజోన్ పొర క్షీణతను అరికట్టాలని తీర్మానించాయి. అప్పటి నుంచే.. ప్రతి సంవత్సరం అదే రోజున అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నారు.
ఇతర గ్రహాలపై జీవాల ఉనికికి సింబల్ ఇదేనా ?
గెలాక్సీ లో ఇప్పటిదాకా 5,000కుపైగా గ్రహాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటిపై జీవులు ఉన్నాయా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. ఇతర గ్రహాలపై జీవజాలం ఉనికి ఉందనడానికి ఆధారాలేవీ ఇప్పటిదాకా లభించలేదు. పరిశోధనల్లో భాగంగా కొందరు శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఏదైనా గ్రహాన్ని మందపాటి ఓజోన్ పొర ఆవరించి ఉంటే ఆ గ్రహంపై జీవుల ఉనికి ఉందని అనుమానించవచ్చని పేర్కొన్నారు. ఏదైనా నక్షత్రానికి లోహతత్వం(మెటాలిసిటీ) ఎక్కువగా ఉంటే దాని చుట్టూ ఉన్న గ్రహాలపై రక్షిత ఓజోన్ పొర ఆవరించి ఉంటుందని గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ కమ్యూనికేషన్’ పత్రికలో ప్రచురించారు.