Prashant Kishore: ప్ర‌శాంత్ కిషోర్ వ‌ల్ల లాభ‌మా? న‌ష్ట‌మా?

భార‌త దేశంలో అనేక రాజ‌కీయ పార్టీల‌కు ఆచార్యుడిగా, దేశ రాజ‌కీయాల‌కే అప్ర‌క‌టిత రాజ‌గురువుగా మారిపోయాడు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.

  • Written By:
  • Updated On - February 6, 2022 / 12:16 PM IST

భార‌త దేశంలో అనేక రాజ‌కీయ పార్టీల‌కు ఆచార్యుడిగా, దేశ రాజ‌కీయాల‌కే అప్ర‌క‌టిత రాజ‌గురువుగా మారిపోయాడు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్. 2012లో గుజ‌రాత్ లో న‌రేంద్ర మోడీ మూడోసారి ముఖ్య‌మంత్రి కావ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌చార వ్యూహాల‌ను రూపొందించి ఆయ‌న విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు కిషోర్. 2014లో మోడీ ప్ర‌ధాని కావ‌డానికి రూపొందించిన వ్యూహాలు, ప్ర‌చారంలో హైటెక్ పోక‌డ‌ల‌తో కాంగ్రెస్ ను మ‌ట్టి క‌రిపించి దేశం దృష్టిలో ప‌డ్డారు. ఒక రాష్ట్రంలో, దేశంలో ఒక పార్టీ విజ‌యం సాధించ‌డానికి వెన‌కుండి వ్యూహాలు రూపొందించిన దిట్ట గ‌నుకే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ఆయ‌న పేరు దేశంలో మార్మోగిపోయింది. 45 ఏళ్ళ ఈ బీహారీ మేధావి ప్ర‌జారోగ్య రంగంలో శిక్ష‌ణ పొందాడు. ఐక్య‌రాజ్య‌స‌మితిలో ఐదు సంవ‌త్స‌రాలు ప‌నిచేసిన త‌ర్వాత భార‌త రాజ‌కీయాల్లో ప్ర‌వేశించారు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల‌తో స‌హా త‌మిళ‌నాడు నుంచి బెంగాల్ వ‌ర‌కు ఏపీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు అనేక ప్రాంతీయ పార్టీల‌కు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేసి ఆయా పార్టీల విజ‌యానికి బాట‌లు వేశారు. తాజాగా తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు కూడా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేసేందుకు చ‌ర్చ‌లు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో ప్ర‌శాంత్ కిషోర్ ఐ ప్యాక్ సంస్థ‌తో టీఆర్ఎస్ కు ఒప్పందం కుదర‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అధికారంలోకి రావాల‌నుకుంటున్న పార్టీల‌కు, వ‌చ్చిన అధికారం నిలుపుకోవాల‌నుకుంటున్న పార్టీల‌కు ప్ర‌శాంత్ కిషోర్ ఒక ఆశాకిర‌ణంగా క‌నిపిస్తున్నారు.

2017లో ఒకేసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో యూపీలో, పంజాబ్ లో కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ ప‌నిచేసింది. పంజాబ్ లో స‌క్సెస్ అయినా యూపీలో విజ‌యం సాధించ‌లేక‌పోయారు. ప్ర‌శాంత్ కిషోర్ మేధావి కావ‌చ్చు. మోడీ ప్ర‌ధాని కావ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌చారం చేయ‌డంలో స‌క్సెస్ అయిండొచ్చు. అయితే బీజేపీలో ప్ర‌శాంత్ కిషోర్ కంటే మేధావులున్నారు. మోడీ, అమిత్ షా ద్వ‌యం వేస్తున్న రాజ‌కీయ పాచిక‌ల‌కు దేశంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు గిజ‌గిజ‌లాడుతున్నాయి. అలాగే తూర్పు ఉత్త‌ర‌ప్ర‌దేశ్లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక యంత్రాంగాన్ని నిర్మించుకున్న ఆధిత్య‌నాథ్ యోగి, మోడీ, అమిత్ షా వ్యూహాల ముందు 2017 ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిషోర్ తెలివితేట‌లు ప‌నిచేయ‌లేదు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అప్ప‌టికే ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గిన‌ తెలుగుదేశం పార్టీని తీవ్రంగా దెబ్బ‌తీయ‌డంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ కు ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాలు ప‌నికొచ్చాయి. అదేవిధంగా త‌మిళ‌నాడులో జ‌యల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత కుక్కలు చింపిన విస్త‌రిలా మారిన అన్నా డీఎంకేను ఓడించ‌డంలో డీఎంకేకు ప్ర‌శాంత్ కిషోర్ తెలివితేట‌లు ఉప‌యోగ‌ప‌డ్డాయి. అలాగే బెంగాల్ అప్ప‌టికే రెండుసార్లు విజ‌యం సాధించి ప్ర‌తిప‌క్షాల‌ను లేవ‌కుండా తొక్కిపెట్టిన మ‌మ‌తా బెన‌ర్జీకి ప్ర‌శాంత్ కిషోర్ తోడ‌య్యారు. దీంతో బెంగాల్ లో మోడీ, అమిత్ షా వ్యూహాలు ప‌నిచేయ‌లేదు. ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన విధంగా బీజేపీకి సీట్లు వ‌చ్చాయి. మ‌మ‌తా బెన‌ర్జీ మ‌ళ్ళీ సీఎం అవుతుంద‌ని ఛాలెంజ్ చేసి గెలిపించారు. మ‌మ‌త విజ‌యం త‌ర్వాత ప్ర‌శాంత్ కిషోర్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది.

కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీని ఉద్ద‌రించుదామ‌ని అనుకున్న‌ప్ప‌టికీ, గాంధీ కుటుంబానికి, ప్ర‌శాంత్ కు ఎక్క‌డో చెడింది. అంత‌కుముందే కాషాయ పార్టీతో ప్ర‌శాంత్ కిషోర్ కు బెడిసికొట్టింది. కాంగ్రెస్ లో చేర‌డంలేద‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత‌ రాహుల్ గాంధీ మీద దండెత్తారు. బీజేపీని ఓడించ‌డం కాంగ్రెస్ వ‌ల్ల కాద‌ని తేల్చేశారు. కాంగ్రెసేత‌ర‌, బీజేపీయేత పార్టీల‌ను ఏకం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అదే ప‌నిమీద ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు సూచిస్తున్నాయి. నేటి రాజ‌కీయ పార్టీలు రాష్ట్రాలు, దేశాన్ని అభివృద్ధి మార్గంలో న‌డిపించి అధికారంలోకి రావాల‌నుకోవ‌డంలేదు. వారికి తాత్కాలిక సాయాలు అందించి, ప్ర‌లోభాల‌కు గురిచేసి అధికారంలోకి రావాల‌నుకునే నాయ‌కులు దేశంలో ఎక్కువైపోయారు. ప్ర‌శాంత్ కిషోర్ ఎన్నిక‌ల వ్యూహాలు కూడా బ‌డ్జెట్ ల‌ను ప‌ట్టించుకోవ‌డంలేదు. ఈ హామీలు వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు నిజంగా మేలు జ‌రుగుతుందా? రాష్ట్ర ఖ‌జానాకు భారం అవుతుందా? అనే ఆలోచ‌న‌లు చేయ‌డంలేదు. ప్ర‌త్య‌ర్థుల్ని మ‌ట్టి క‌రిపించి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించామా లేదా అన్న‌దే ముఖ్యంగా చూస్తున్నారు కాని ఈ వ్యూహాలు రాష్ట్రానికి, ప్ర‌జ‌ల‌కు ఎంత మేలు చేస్తాయ‌న్న‌ది ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేదు. ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాలు రూపొందించ‌ని కాలంలో కూడా దేశంలో అనేక పార్టీలు గెలిచాయి. ఓడాయి. అవ‌న్నీ వాటి ప‌రిపాల‌నే గీటురాయిగా గెలుపోట‌ములు చూశాయి.