Site icon HashtagU Telugu

Elephant: ఇదో ఏనుగుల వింత ఎపిసోడ్‌

Elephant

Elephant

ఎవ‌రైనా మ‌నుషులు బియ్యాన్ని తీసుకెళ‌తారు. బియ్యం దొంగ‌ల‌ను అనేక సంద‌ర్భాల్లో చూశాం. కానీ, ఏనుగులు బియ్యాన్ని మాయం చేసిన విచిత్ర సంఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగింది. న‌ష్ట‌ప‌రిహారంగా అటవీశాఖ అధికారులు తిరిగి బియ్యాన్ని ఇవ్వ‌డం ఈ ఎపిసోడ్ లోని హైలెట్ పాయింట్. దీనికి సంబంధించిన వివ‌రాలివి. కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరు తాలూకాలోని అనుఘట్ట వద్ద ఉన్న సహకార సంఘం బియ్యాన్ని నిల్వ చేసింది. ఆఫీస్ ఆవరణలోకి ఏప్రిల్ 21 రాత్రి అడవి ఏనుగు ప్రవేశించింది. ప్రాథమిక సహకార వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకుకు చెందిన గోడౌన్ లో ఉంచిన‌ ఐదు బస్తాల బియ్యాన్ని తినేసింది. అనుఘట్టలోని ప్రాథమిక సహకార అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలోకి అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఏనుగు ప్రవేశించింది.

సీసీటీవీ కెమెరా ఫుటేజీలో ఏనుగు తన తొండం ఉపయోగించి బియ్యం బస్తాలను తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆ మేర‌కు హెచ్.పి. హాసన్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమార్, బ్యాంక్ అధికారులు ఈ సమస్యను కర్ణాటక అటవీ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ అధికారులు సొసైటీని సందర్శించి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఏనుగులు బియ్యాన్ని తిన్నాయ‌ని నిర్థారించుకున్నారు. జ‌రిగిన న‌ష్టానికి ప‌రిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. హాసన్ జిల్లాలోని బేలూరు, ఆలూరు, సకలేష్‌పూర్ తాలూకాల్లో దాదాపు 60 ఏనుగులు సంచరిస్తున్నాయ‌ని ఈ సంద‌ర్భంగా ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

Exit mobile version