Site icon HashtagU Telugu

Science Mysteries : నంది విగ్రహం పాలు తాగడం వెనుక అసలు రహస్యం ఇదే! కొన్ని విగ్రహాలు ఎందుకు తాగవంటే..?

Nandi Milk

Nandi Milk

తెలుగు రాష్ట్రాల్లో నందీశ్వరుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయి. కొద్ది రోజులుగా ఇదే హాట్ టాపిక్. గతంలో వినాయకుడి విగ్రహాలు కూడా పాలు తాగాయి అన్నారు. ఇప్పుడు నందీశ్వరుడి విగ్రహాల దగ్గర భక్తులు
క్యూ కడుతున్నారు. స్వయంగా వారి చేతులతో పాలు తాగిస్తున్నారు. ఇది సరే.. గతంలో పాలు తాగని నందీశ్వరుడు ఇప్పుడు ఎందుకు పాలు తాగుతున్నాడు? దీని వెనుక కారణాలేమిటి అన్నదానిపై సైన్స్ ఏం చెబుతోంది?

విగ్రహాలు పాలు తాగడం తెలుగునాట, దేశవిదేశాల్లో కొత్త కాదు. ఎందుకంటే వినాయకుడు మొదలు చాలా విగ్రహాలు గతంలో కూడా పాలు తాగాయి. నీళ్లు కూడా తాగాయి. అది భగవంతుడి మహిమే అని భక్తుల విశ్వాసం. కాదు దాని వెనుక సైన్స్ చెప్పిన సరైన కారణం ఉందన్నది శాస్త్రవేత్తల వాదన. దానికి తగ్గట్టే వాళ్లు ఇతర విగ్రహాలతో కూడా పాలు తాగిస్తున్నారు. అసలు అవి పాలను ఎలా తాగుతున్నాయి? వాటిని ఎలా జీర్ణం చేసుకుంటున్నాయి?

గత సంఘటనలను పరిశీలిస్తే.. సాయి బాబా విగ్రహం నుంచి విభూది రాలిన ఘటన ఉంది. అలాగే ఆ శ్రీరామచంద్రుడి ప్రతిమ కళ్ల నుంచి నీళ్లు కారాయి. దీంతోపాటు వినాయకుడి విగ్రహాలూ పాలు తాగిన ఘటనలు అందరికీ తెలుసు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు నందీశ్వరుడు పాలు తాగడం ఏమిటా అని భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఆ శివుడి మహిమే అని పూజలు చేస్తున్నారు. కానీ సైన్స్ మాత్రం దీనికి కారణం తలతన్యత (Surface tension) అని చెబుతోంది. అసలీ తలతన్యత (surface tension) అంటే ఏమిటి?

తలతన్యత అంటే నీటితోపాటు ఇతర ద్రవపదార్థాలకు ఉన్న భౌతిక ధర్మం. దీనివల్లే విగ్రహాలు పాలు పీల్చుకుంటాయి. అది ఆ విగ్రహాలకున్న తేమను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే విగ్రహాలు ఒక్కోసారి పాలను కాని, నీళ్లను కాని తాగుతాయి. మరికొన్నిసార్లు అలా తాగలేవు. ఇక ఎలాంటి విగ్రహాలు పాలను తాగుతాయి అంటే.. ప్లాస్టరాఫ్ పారిస్ తో, మట్టితో, సుద్దతో, చెక్కముక్కలతో చేసిన విగ్రహాలు నీటిని లేదా పాలను పీల్చుకుంటాయి. రాయితో కాని లోహాలతో కాని చేసిన విగ్రహాలు ద్రవపదార్థాలను పీల్చుకున్నా.. పక్కనుంచి కారిపోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు.

Exit mobile version