Site icon HashtagU Telugu

Charaka Shapath: వైద్యంలో `ప్ర‌మాణ` పైత్యం

Medical

Medical

గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనిది ఇప్పుడు.. వైద్య విద్యార్థులు దేని సాక్షిగా ప్రమాణం చేయాలి ? అనే అంశంపై వాడివేడి చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ గ్రీకు వైద్య నిపుణుడు హిప్పోక్రటిస్ పేరిట ప్రమాణం చేస్తుండగా.. ఇకపై “చరక సంహిత” ప్రకారం శపథం చేయాలనే వాదనలూ తెరపైకి వచ్చాయి. ఇటీవల తమిళ నాడులోని మదురై ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో కొత్తగా చేరిన విద్యార్థులు చరకుడి పేరిట ప్రమాణం చేయడం వివాదానికి దారి తీసింది. దీంతో కాలేజీ డీన్‌ రత్నవేల్‌ ను తమిళనాడు ప్రభుత్వం బాధ్యతల నుంచి తొలగించింది. పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది. దీనిపై విచారణకూ ఆదేశించింది. ఇలా నిబంధనలు అతిక్రమించడం సరికాదని తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్‌ అన్నారు.

చరక సంహిత ఏమిటి ?

చరక సంహిత 1, 2వ శతాబ్దానికి చెందిన ప్రాచీన వైద్య గ్రంథం. సుశ్రుతుడు 4వ శతాబ్దంలో రూపొందించిన గ్రంథాల్లో శస్త్ర చికిత్స గురించి ఉంటుంది. ఇది గ్రీసు విధానం కంటే పురాతనమైనదని అంటారు. ఆయుర్వేదిక్ వైద్యం ఈ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంటుంది. ఒక మహిళకు చికిత్స చేస్తున్నప్పుడు ఆమెకు సంబంధీకులైన పురుషుడు కూడా వైద్యం అందిస్తున్న సమయంలో దగ్గర ఉండాల్సిన అవసరాన్ని చరక శపథం చెబుతుంది. రోగితో ప్రయోగం చేయకూడదని చరక శపథం చెబుతుంది. తీవ్రంగా రోగం బారిన పడిన రోగితో వ్యవహరించాల్సిన తీరు, మరణ వార్తను తెలియచేసే విధానం లాంటి సూక్ష్మాతి విషయాలను కూడా చరక సంహితలో పొందుపరిచినట్లు చెబుతారు. ఆయుర్వేద వైద్యులు కావడానికి అవసరమైన అర్హతలను సుశ్రుత సంహితలో విధికాను ప్రవేశలో పొందుపరిచినట్లు చెప్పారు.

చరక శపథం ఎందుకు వివాదాస్పదం అవుతోంది?

“బ్రాహ్మణులు , పవిత్ర అగ్ని, వైద్య నిపుణుల సమక్షంలో వైద్య విద్యార్థులు ప్రతిజ్ఞ చేయాలి” అనే ప్రస్తావన చరక శపథం లో ఉందనే చర్చ జరుగుతోంది. ఇది ఒక కులం పెత్తనాన్ని అందరి పై రుద్దేలా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో మెడికల్‌ కాలేజీలలో చదువుతున్న చరక శపథంలో ..” నా గురువు నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చే దిశగా నేను పూర్తి కృషి చేస్తాను” అని ఉంది. “గురువులకు బానిసల్లా సపర్యలు చేయాలి” అని చరక శపథం అసలు మూలంలో ఉంది. దాదాపు అదే అర్ధాన్ని ఇచ్చే రీతిలో మదురై ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ప్రమాణం చేయించడం గమనార్హం.