Prisoners Voting Rights : ఖైదీలకు ఓటుహక్కు ఉంటుందా ? ఉండదా ?

Prisoners Voting Rights : జైలులోని ఖైదీలకు ఓటు హక్కు ఉంటుందా ? పోలింగ్‌లో పాల్గొనేందుకు వారిని అనుమతిస్తారా ? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. 

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 07:41 AM IST

Prisoners Voting Rights : జైలులోని ఖైదీలకు ఓటు హక్కు ఉంటుందా ? పోలింగ్‌లో పాల్గొనేందుకు వారిని అనుమతిస్తారా ? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది.  వాస్తవానికి దీనిపై చాలా ఏళ్లుగా న్యాయ వివాదాలు నడుస్తున్నాయి. ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలంటూ  1997లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.  అప్పట్లో  ఆ పిటిషన్‌ని తిరస్కరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం అందుకు కొన్ని కారణాలను వివరించింది. సుప్రీంకోర్టు చెప్పిన మొదటి కారణం.. ఖైదీలు ఓటు వేయాలంటే వాళ్లు తప్పించుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. రెండో కారణం.. నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి మిగతా పౌరులతో సమాన హక్కుల్ని పొందలేడు. వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేనప్పుడు ఆ హక్కును కల్పించలేం అని సుప్రీంకోర్టు పేర్కొంది. మూడో కారణం.. ఎన్నికల నుంచి నేరస్తులను దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join

ఈ దేశాల్లో ఖైదీలకు ఓటుహక్కు

భారత సుప్రీంకోర్టు చెప్పిన దానికి భిన్నంగా  18 ఐరోపా దేశాలు ఖైదీలకు ఓటు హక్కును(Prisoners Voting Rights) కల్పించాయి. అయితే అక్కడ జనాభా తక్కువ, ఖైదీల సంఖ్య  తక్కువ కాబట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం చాలా ఈజీ. మనదేశంలో జనాభా ఎక్కువ, ఖైదీల సంఖ్య కూడా ఎక్కువే కాబట్టి భద్రతా ఏర్పాట్లు అంత ఈజీ కాదు. ఇరాన్‌, ఇజ్రాయెల్, పాకిస్తాన్ దేశాల్లోనూ ఖైదీలకు ఓటుహక్కు ఉంది.

కేంద్రానికి, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

అందరికీ ఓటు వేసే హక్కు ఉందని మనం చెప్పుకుంటున్నా ఖైదీలకు మాత్రం ఆ ఛాన్స్ దక్కడం లేదు.కేసుల్లో దోషిగా తేలి  శిక్షపడిన ఖైదీలకు ఓటు లేకపోవడానికి ఓ లెక్క ఉంది. కానీ ఇంకా దోషిగా  తేలని అండర్ ట్రయల్ ఖైదీలకూ ఓటు వేసే హక్కు దక్కకపోవడం విచారకరం.  ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 62(5) ప్రకారం నేరస్థులకు ఓటు హక్కును కల్పించడం లేదని ఎన్నికల సంఘం చెబుతోంది. లీగల్ కస్టడీ , పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్లు, ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్లు ఓటు వేసేందుకు అనర్హులు అని ఆ సెక్షన్ తేల్చిచెప్పిందని ఈసీ గుర్తు చేస్తోంది. 2019లో ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌కు ఈమేరకు ఈసీ బదులిచ్చింది. అండర్ ట్రయల్ ఖైదీలకు ఎన్నికల్లో పాల్గొనే అర్హత ఉన్నప్పుడు.. ఓటు వేసే హక్కు మాత్రం ఎందుకు ఉండదని కొందరు న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక గతేడాది నవంబరులోనూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఖైదీలకు ఓటువేసే అవకాశం ఇవ్వాలని అందులో కోరారు. ఈ పిటిషన్‌పై స్పందన తెలపాలంటూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.

Also Read : Akshaya Tritiya 2024: ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడంటే..? ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!