MegaStar: చిరంజీవిపై అప్పట్లో విషప్రయోగం చేయించింది ఎవరు? మెగాస్టార్ దాని నుంచి ఎలా బయటపడ్డారు?

అనుకుంటాం కానీ.. సినీ పరిశ్రమలో కుట్రలు, కుతంత్రాలకు లోటు లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు పైకి వస్తుంటే.. వాళ్లను కిందకు లాగడానికి పదిమంది ప్రయత్నిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 12:23 PM IST

అనుకుంటాం కానీ.. సినీ పరిశ్రమలో కుట్రలు, కుతంత్రాలకు లోటు లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు పైకి వస్తుంటే.. వాళ్లను కిందకు లాగడానికి పదిమంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి చిత్రసీమలో ఎవరి అండదండలూ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన నటుడు చిరంజీవి. తొలుత విలన్ వేషాలు వేసినా.. తరువాత హీరోగా మారారు. అప్పటి నుంచి నటనే ప్రాణంగా పనిచేయడంతో.. టాలీవుడ్ లో మెగాస్టార్ గా దూసుకుపోయారు. అలాంటి చిరంజీవిపై విషప్రయోగం జరిగిందని మీకు తెలుసా? అప్పట్లో నేషనల్ మీడియా దీనిని బాగా హైలెట్ చేసిందని తెలుసా?

1980ల్లో స్టార్ హీరోగా చిరంజీవి దూసుకుపోతున్న కాలమది. ఆ సమయంలో ఆయన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వారు.. చిరుపై విషప్రయోగం చేశారు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. 1988లో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో చిరంజీవి మరణమృదంగం సినిమా చేస్తున్నారు. దానికి డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి. ఆ సినిమాను చెన్నైలో తీస్తున్న సమయంలో చిరుపై పాయిజన్ అటాక్ జరిగింది.

యండమూరి వీరేంద్రనాథ్ రచించిన మరణమృదంగం నవలనే సినిమాగా తీశారు. దీంతో ఆ చిత్రంపై అప్పటికే భారీ అంచనాలున్నాయి. అప్పట్లో ఆ సినిమాను చెన్నై ఔట్ డోర్ లో తీస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడ గుమిగూడారు. షాట్ మధ్యలో గ్యాప్ రావడంతో తనను కలవడానికి వచ్చిన అభిమానులతో చిరు ముచ్చటిస్తున్నారు. ఇంతలో ఓ అభిమాని వేగంగా అక్కడికి దూసుకొచ్చాడు. అతడే చిరు పాలిట శత్రువని అక్కడివారు ఊహించలేకపోయారు.

చిరు దగ్గరకు వచ్చిన ఆ అభిమాని ఆరోజు తన పుట్టినరోజని.. తాను తెచ్చిన కేకును అక్కడే కట్ చేస్తానని చెప్పాడు. ఆ వెంటనే తనతోపాటు తెచ్చుకున్న కేక్ ను కట్ చేసేసి.. చిరు నోట్లో బలవంతంగా పెట్టడానికి ట్రై చేశాడు. అతడి ప్రయత్నాన్ని ఊహించని చిరు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే తేరుకుని.. ఆ వ్యక్తిని అడ్డుకోబోయారు. ఈ ప్రయత్నంలో ఆ కేక్ కింద పడిపోయింది. కానీ అప్పటికే ఆ కేక్ లో కొంత భాగం.. చిరు నోట్లోకి వెళ్లింది. ఆ కేక్ లో వేరే పదార్థాలు ఉండడం అక్కడివారి కంటపడింది.

చిరు నోట్లోకి కేక్ వెళ్లడం.. ఆ కేక్ లో విషం కలిపి ఉండడంతో.. చిరు పెదాలు నెమ్మదిగా నీలం రంగులోకి మారాయి. అప్పటికే ఆ అభిమాని హంగామాను చూస్తున్న అక్కడివారు.. ఆ వ్యక్తిని సందేహించారు. చిరు పెదాలు కూడా రంగు మారడంతో.. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే చిరంజీవికి పరీక్షలు చేశారు. విషప్రయోగం జరిగిందని గుర్తించారు. ఆ విషానికి విరుగుడు ఇచ్చారు. దీంతో చిరుకు గండం గట్టెక్కింది. ప్రాణాపాయం తప్పింది.

చిరంజీవిపై విషప్రయోగం జరిగిందన్న విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పట్లో నేషనల్ మీడియా అంతా ఈ వార్తను కవర్ చేశాయి. తెలుగు పత్రికల్లో కొన్ని దీనిపై కథనాలు ప్రచురించాయి. అయినా చిరంజీవిపై విషప్రయోగాన్ని ఎవరు చేయించారు అన్నది మిస్టరీగానే ఉండిపోయింది. చిరంజీవిపై అభిమానులు పెట్టుకున్న ఆశలు, వారి అభిమానమే చిరుకు ప్రాణరక్షగా మారింది.

ఇక్కడ హైలెట్ ఏంటంటే.. మరణమృదంగం సినిమా రిలీజ్ సమయంలో.. ఆ సినిమా నిర్మాత కె.ఎస్.రామారావు.. మెగాస్టార్స్ మైటీ మూవీ అని ఈ సినిమాకు ప్రచారం కల్పించారు. ఆ సినిమా నుంచే చిరుకు మెగాస్టార్ అని బిరుదు వచ్చింది.