Hamas Leader – Kerala : కేరళ సభలో హమాస్ నేత ప్రసంగం.. ఎవరీ ఖాలిద్ మషాల్ ?

Hamas Leader - Kerala : ఓవైపు ఇజ్రాయెల్ - హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది.

Published By: HashtagU Telugu Desk
Hamas Leader Kerala

Hamas Leader Kerala

Hamas Leader – Kerala : ఓవైపు ఇజ్రాయెల్ – హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలో హమాస్ పాలిస్తున్న గాజా ప్రాంత ప్రజలకు అనుకూలంగా, గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా కేరళలోని మలప్పురంలో శుక్రవారం జరిగిన నిరసన సభపై రాజకీయ దుమారం రేగుతోంది. ఎందుకంటే.. ఆ సభలో వర్చువల్‌గా  హమాస్ నాయకుడు ఖాలిద్ మషాల్ ప్రసంగించారు.  కేరళలోని జమాతే ఇస్లామీ యువజన విభాగం ‘సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్’  ఆధ్వర్యంలో జరిగిన ఈ సభపై బీజేపీ రియాక్ట్ అయింది. హమాస్ సంస్థ నాయకుడి ప్రసంగాన్ని కేరళలో ఎలా అనుమతిస్తారని పోలీసులను ప్రశ్నించింది. మరోవైపు కేరళ సభను ఉద్దేశించి ఖాలిద్ మషాల్ వర్చువల్‌గా ప్రసంగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సభా ప్రాంగణంలో ‘‘బుల్డోజర్ హిందుత్వ.. వర్ణవివక్షతో కూడిన జియోనిజంను నిర్మూలించాలి’’ అనే పోస్టర్ కూడా ఉన్నట్లు వీడియో ఫుటేజీలో కనిపించింది.

We’re now on WhatsApp. Click to Join.

బీజేపీ నేతలు ఏమన్నారు ?

  • ‘సేవ్ పాలస్తీనా’ ముసుగులో హమాస్‌ను కీర్తించడం ఆందోళనకరమని కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ అన్నారు. ‘‘మలప్పురంలో జరిగిన సభలో హమాస్ నాయకుడు ఖాలిద్ మషాల్ వర్చువల్ ప్రసంగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. కేరళ సీఎం పినరయి విజయన్, కేరళ పోలీసులు ఎక్కడ ఉన్నారు. సేవ్ పాలస్తీనా ముసుగులో కొందరు హమాస్‌ను యోధులుగా కీర్తిస్తున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. దీనిపై కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలి’’ అని సురేంద్రన్ పేర్కొన్నారు.
  • “ఇది వినడానికి షాకింగ్ న్యూస్. భారత్ వంటి లౌకిక దేశంలో.. కేరళ వేదికగా హమాస్ నేతలు ప్రసంగాలు చేయడం ఆందోళనకరం. హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసిందని అందరికీ తెలుసు. అలా దాడులు చేసే సంస్థ ప్రతినిధి కేరళలో ప్రసంగించడం సరికాదు’’  అని కేరళ బీజేపీ ఉపాధ్యక్షురాలు వీటీ రెమా అన్నారు.
  • ‘‘ఇది కేరళ ప్రభుత్వ వైఫల్యం. హమాస్ నేత ప్రసంగం అంశాన్ని  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలి. హమాస్ నేతలతో ప్రసంగాలు చేయిస్తున్న వారికి ఇండియా కూటమిలోని పార్టీలు రక్షణ కల్పిస్తున్నాయి. ప్రోత్సాహం అందిస్తున్నాయి’’ అని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ అన్నారు.
  • ‘‘700 మందిని చంపిన హమాస్‌కు ఇండియా కూటమి ఎందుకు మద్దతిస్తోంది ? ఉగ్రవాదులు మాట్లాడేందుకు వేదికలు ఎందుకు ఇస్తున్నారు ?  ఓటు బ్యాంకు రాజకీయాల కోసమా ? ఇందుకోసం పాలస్తీనాను కూడా ఉపయోగించుకుంటున్నారా ? కేరళలో హమాస్ నేత ప్రసంగించడాన్ని ఇండియా కూటమి ఖండిస్తుందా ? కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందా? ” అని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ప్రశ్నల వర్షం(Hamas Leader – Kerala) కురిపించారు.

‘సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్’ ఏమంటోంది ?

ఈ సభను నిర్వహించిన ‘సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్’ రాష్ట్ర అధ్యక్షుడు సుహైబ్ సితి మాట్లాడుతూ.. ‘‘హమాస్ సంస్థ భారతదేశంలో కార్యకలాపాలు చేయడం లేదు. కాబట్టి ఇక్కడి సభలో ఆయన మాట్లాడటం చట్ట ప్రకారం నేరం కాదు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు మేం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దీన్ని అసాధారణంగా చూడాల్సిన అవసరమేదీ లేదు.  గతంలోనూ కేరళలో జరిగిన చాలా కార్యక్రమాల్లో హమాస్ నాయకులు ప్రసంగించారు.  హమాస్ ఒక ప్రతిఘటన ఉద్యమం. పాలస్తీనాలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సీట్లు కూడా గెల్చుకుంది’’ అని వివరించారు.

ఖాలిద్ మషాల్ ఎవరు?

  • ఖాలిద్ మషాల్ హమాస్ పొలిట్‌బ్యూరో వ్యవస్థాపక సభ్యుడు. అతడు 2017 వరకు సంస్థ ఛైర్మన్‌గా ఉన్నారు.
  • చాలా సంవత్సరాలుగా హమాస్ కీలక నాయకత్వంలో ఖాలిద్ మషాల్  ఉన్నారు.
  • ఖాలిద్ మషాల్ వెస్ట్ బ్యాంక్‌లో జన్మించారు. కువైట్, జోర్డాన్‌లలో పెరిగాడు.
  • ఖాలిద్ మషాల్  2004 నుంచి  ప్రవాసంలో (ఇతర దేశాల్లో) ఉంటూ హమాస్‌కు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
  • ఖాలిద్ మషాల్  ఎప్పుడూ గాజాలో నివసించలేదు. జోర్డాన్, సిరియా, ఖతార్, ఈజిప్ట్ కేంద్రంగా అతడు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.
  • ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రకారం.. ఖాలిద్ మషాల్  ఇప్పుడు ఖతార్‌లో ఉన్నాడు.

Also Read: CBN Gratitude Concert : చంద్రబాబు ఘనతకు చరిత్రే సాక్ష్యం.. ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’ నేడే !

  Last Updated: 29 Oct 2023, 08:47 AM IST