Hindutva Leader: ఎవ‌రు ఎక్కువ హిందూత్వ వాది?

స్వతంత్రం వ‌చ్చాక నాలుగు ద‌శాబ్దాల పాటు ఎన్నిక‌లు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ పోరులానే సాగాయి. ప్ర‌జా స‌మ‌స్య‌లు, అవినీతి ప్ర‌ధాన అంశాలుగా ఎన్నిక‌ల్లో ప్ర‌చారం జ‌రిగేది. కాని 1990వ ద‌శ‌కం నుంచి దేశ రాజ‌కీయాల్లో మ‌తం ప్ర‌వేశించింది.

  • Written By:
  • Updated On - February 2, 2022 / 09:32 AM IST

స్వతంత్రం వ‌చ్చాక నాలుగు ద‌శాబ్దాల పాటు ఎన్నిక‌లు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ పోరులానే సాగాయి. ప్ర‌జా స‌మ‌స్య‌లు, అవినీతి ప్ర‌ధాన అంశాలుగా ఎన్నిక‌ల్లో ప్ర‌చారం జ‌రిగేది. కాని 1990వ ద‌శ‌కం నుంచి దేశ రాజ‌కీయాల్లో మ‌తం ప్ర‌వేశించింది. స్వ‌తంత్ర పోరాటంలో పాల్గొన్న చ‌రిత్ర లేని, ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ పూర్తిగా హిందూత్వ అంశం ఆధారంగానే రాజ‌కీయాలు చేయ‌డం ప్రారంభించింది. ఈ దేశంలో ఓట్ల కోసం మైనారిటీల‌ను కాంగ్రెస్ లేదా సంకీర్ణ ప్ర‌భుత్వాలు బుజ్జ‌గిస్తున్నాయ‌ని విమ‌ర్శిస్తూ, అప్ప‌టికే వేడెక్కిన అయోధ్య బాబ‌రీ మ‌సీదు, రామ మందిరం వివాదంతో మ‌తాన్ని, రాజ‌కీయాల‌ను క‌ల‌గాపుల‌గం చేసింది బీజేపీ నాయ‌క‌త్వం. బోఫోర్స్ కుంభ‌కోణం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో …కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చిన వీపీ సింగ్ సార‌థ్యంలో నేష‌న‌ల్ ఫ్రంట్ విజ‌యం సాధించింది. ఈ సంకీర్ణ ప్ర‌భుత్వానికి బీజేపీ బ‌య‌టినుంచి మ‌ద్ద‌తిచ్చింది. మ‌ద్ద‌తిచ్చే స్థాయి నుంచి అధికారం పొందే స్థాయికి ఎద‌గాలంటే త‌న విశ్వ రూపం చూపించాల‌ని బీజేపీ నాయ‌క‌త్వం అనుకుంది. బీజేపీలో అతివాద నాయ‌కుడిగా పేరున్న ఎల్ కే అద్వానీ అయోధ్య రామ‌మందిరం కోసం ర‌థ‌యాత్ర నిర్వ‌హించి దేశంలో హిందువులు, ముస్లింల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు రెచ్చ‌గొట్టారు. అయోధ్య ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికారం సాధించారు. కేంద్రంలో పీవీ న‌ర‌సింహారావు నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఇదే అద‌నుగా 1992 డిసెంబ‌ర్ 6న కాషాయ సేన‌లు క‌ర‌సేవ‌కుల రూపంలో ల‌క్ష‌న్నర మంది అయోధ్య‌ను చుట్టుముట్టి బాబ‌రీ మ‌సీదును కూల‌గొట్టారు. ఫ‌లితంగా దేశ‌మంతా మ‌త ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగి వేలాది మంది చ‌నిపోయారు.

యూపీలో ముఖ్య‌మంత్రిగా బీజేపీ నేత క‌ల్యాణ్ సింగ్ ఉన్న‌పుడే బాబ‌రీ మ‌సీదు కూల్చారు. అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కూడా మౌనం దాల్చ‌డ‌మే ఇంత‌టి దారుణానికి కార‌ణ‌మైంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. బాబ‌రీ మ‌సీదు విష‌యంలో బ్రిటిష్ వారి కాలంలోనే 1859లో వివాదం మొద‌లైతే మ‌సీదుకు కంచె ఏర్పాటు చేశారు. అయితే స్వ‌తంత్రం వ‌చ్చాక 1949లో మ‌సీదులో రాముడి విగ్ర‌హాలు ఏర్పాటు చేశారు. ఇక అప్ప‌టి నుంచి వాటిని అక్క‌డి నుంచి తీయ‌లేదు. 1986లో కాంగ్రెస్ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ కాలంలోనే రాముడి విగ్ర‌హాల‌కు పూజ‌లు చేయ‌డానికి అనుమ‌తిచ్చారు. 1992లో బాబ‌రీ మ‌సీదును కూల్చి రామ మందిరం నిర్మాణానికి దారి తీసిన మూడు ప్ర‌ధాన సంఘ‌ట‌న‌లు సంభ‌వించిన‌పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాలే ఉన్నాయి. మ‌తం పేరుతో హిందువుల భావోద్వేగాలు రెచ్చ‌గొట్టి ఓట్లు కొల్ల‌గొట్ట‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తే…తాను కూడా హిందుత్వ విష‌యంలో ఏమాత్రం త‌గ్గేదే లే అని కాంగ్రెస్ కూడా ప్ర‌తి సారీ స‌హ‌క‌రించింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బీజేపీ పూర్తిగా అయోధ్య రామ‌మందిరం, హిందూత్వ కార్డ్ తో ఓట్ల వేట ప్రారంభించడంతో, కాంగ్రెస్ కూడా అదేబాట‌లో న‌డుస్తోంది. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా కాంగ్రెస్ యువ‌రాజు రాహ‌ల్ గాంధీ… తాను కూడా హిందువునే అని చెప్పుకోవ‌డానికి ఆల‌యాల వెంట తిరుగుతున్నారు. కాని అతి వాద హిందూత్వ వాద పార్టీగా బీజేపీకున్న పేరు ముందు రాహుల్ హిందుత్వ‌వాదం ప‌నిచేయ‌డంలేదు. ఇప్పుడు యూపీ ఎన్నిక‌ల్లో కూడా రాహుల్ గాంధీ ఇదే ట్రంప్ కార్డ్ ను ప్ర‌యోగిస్తున్నారు. దేశంలో అతి ఎక్కువ హిందుత్వ వాదులు బీజేపీలో ఉన్నారా…కాంగ్రెస్ లో ఉన్నారా? ఎవ‌రు ఎక్కువ హిందుత్వ వాది అనే చ‌ర్చ దేశంలో న‌డుస్తోంది.

ఇక ప్ర‌జ‌లంతా స‌మానులు కాదంటూ…మాంసాహారం తినేవారిని హేళ‌న చేసే శ్రీ త్రిదండి చిన జీయ‌ర్ స్వామి… స‌మ‌తామూర్తి, వెయ్యేళ్ళ‌నాడే మాన‌వులంతా స‌మాన‌మ‌ని బోధించిన శ్రీ రామానుజుల విగ్ర‌హాన్నిహైద‌రాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు వ్య‌య‌మే వెయ్యి కోట్ల రూపాయ‌లు. ఒక మ‌తాన్ని వ్య‌తిరేకిస్తూ…హిందూమ‌త‌మే స‌ర్వోత‌న్న‌త‌మైన‌దని కీర్తించే బీజేపీకి చెందిన ప్ర‌ధాని నరేంద్ర మోడీ శ్రీ రామానుజుల విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రాబోతున్నారు. జాతి పిత గాంధీని హ‌త్య చేసిన గాడ్సేని ప్రేమించే బీజేపీ నాయ‌కులు ఈ మ‌త కార్య‌క్ర‌మానికి హాజ‌రవుతున్నారు. జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ హ‌యాంలో వంద‌ల కోట్ల ఖ‌ర్చుతో ప్రాజెక్టులు నిర్మిస్తే…ఇప్పుడు వేల కోట్ల ఖ‌ర్చుతో విగ్ర‌హాలు ఏర్పాటు చేస్తున్నారు. భార‌త‌దేశం లౌకిక రాజ్యం అని రాజ్యాంగంలో రాసుకున్నాం. కాని ప్ర‌ధానులు, ముఖ్య‌మంత్రులు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప్రాజెక్టుల కంటే వంద‌ల‌, వేల కోట్ల‌తో విగ్ర‌హాలు, ఆల‌యాలు నిర్మించ‌డానికే ప్రాధాన్య‌మిస్తున్నారు. నాలుగు ద‌శాబ్దాలుగా దేశంలో మారిన రాజ‌కీయాలతో, పార్టీలు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల కంటే మ‌తానికే ప్రాధాన్య‌మిస్తున్నాయి. బాబ‌రీ మ‌సీదును కూల్చిన గుంపులో ఉన్న శివసేన‌తో ఇప్పుడు మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వాన్ని న‌డుపుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇంత‌కీ భార‌త్ ఇప్పుడు లౌకిక రాజ్య‌మా ? మ‌త రాజ్య‌మా?