ఇప్పుడు దేశమంతా ఒక తెగ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటోంది. అదే సంతాల్ తెగ. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆ తెగకు చెందినవారే. అందుకే ఆ గిరిజన తెగ పూర్వపరాలు ఏమిటి.. ఇప్పుడు ఆ తెగలోనివారు ఎలా ఉన్నారు.. వారంతా ఏం చేస్తున్నారు అన్నదానిపై ఎక్కువమంది సెర్చ్ చేస్తున్నారు. నిజానికి సంతాల్ గిరిజన తెగ ఇప్పటిది కాదు.పైగా.. మన దేశంలో మొదటి స్వాతంత్ర్య సమరం ప్రారంభానికి రెండు సంవత్సరాల ముందే.. తెల్లదొరలపై తిరుగుబాటు జెండా ఎగరేసి మీసం తిప్పిన తెగ ఇది. బ్రిటిషర్ల సైన్యం, ఆధునిక ఆయుధ సంపత్తితో పోరాడలేమని తెలిసినా సరే.. ఆత్మగౌరవం కోసం, తాము నమ్ముకున్న అడవితల్లిని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన చరిత్ర వీరిది.
బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్..ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఆదివాసి తెగ విస్తరించి ఉంది. సంతాలి భాషను మాట్లాడే ఈ తెగకు ఆత్మాభిమానం ఎక్కువ. వేట, సాగు.. ఈ రెండే వీరికి జీవనాధారం. తమ కడుపు నింపే అడవితల్లే వీరికి దేవత. కానీ వారి ప్రాణానికి ప్రాణమైన అడవులను నరికి.. అక్కడ వాణిజ్య పంటలు వేయాలని అప్పటి బ్రిటీష్ సర్కారు ఆలోచించింది. ఆ నిర్ణయాన్ని 1793లో ప్రవేశపెట్టి అమలు చేసింది. అలా ఈ సంతాలీలు ఉండే అటవీ భూమిని కూడా వేలం వేసి అక్కడి జమిందారులకు అప్పగించారు. దీంతో సంతాలీలు తిరుగుబాటు చేయకుండా.. వారికి ఒకేచోట భూమిని కేటాయిస్తామని చెప్పారు. ప్రస్తుతం జార్ఖండ్ లో ఉన్న సంతాల్ పరగణా అలా కేటాయించిందే. దీంతో ఆ ఆదివాసీ తెగ ఎంతో సంబరపడింది.
తమ జీవితాలు మారబోతున్నాయని భావించిన సంతాల్ గిరిజనులు.. బెంగాల్, బీహార్, ఒడిశాలో ఉన్న తమ తెగ వారిని.. వచ్చేయమని కోరారు. వాళ్లంతా ఒక్కచోటుకు చేరి.. ప్రభుత్వం అప్పగించిన భూమిని చదును చేశారు. దానిని నివసించడానికి వీలుగా మార్చేశారు. ఇక అక్కడ తామే సాగు చేసుకుని.. కుటుంబాలతో సంతోషంగా ఉండవచ్చు అనుకున్నారు. కానీ అక్కడ సీన్ రివర్సయ్యింది. ఆ భూమిని జమిందార్ల పరం చేసింది అప్పటి ప్రభుత్వం. దీంతో సంతాల్ లకు దిక్కుతోచలేదు. తమ భూమిలోనే వారు పరాయివారైపోయారు. వేరు వేరు పనుల కోసం కూలీలుగా మారారు. అప్పటివరకు వస్తుమార్పిడి పద్దతి ద్వారా జీవనం సాగించిన వారికి.. డబ్బుల చెలామణిపై అవగాహన లేకుండా పోయింది. దీనిని తమకు అనువుగా మార్చుకున్నారు అప్పటి వడ్డీ వ్యాపారులు.
తమ పరిస్థితి ఏంటని పదే పదే అప్పటి బ్రిటీష్ ప్రబుత్వాన్ని అడిగినా వారి నుంచి సరైన స్పందన లేదు. అందుకే సంతాల్ ల తెగ పూజారులుగా ఉండే ముర్ము సోదరులు.. తమ వర్గాన్నంతా ఏకం చేశారు. తిరుగుబాటు తప్పదని 1855 జూన్ లో ప్రకటించారు. తమ నిర్ణయాన్ని తెగలో అందరికీ తెలిసేనా ఆకుల ద్వారా సమాచారం పంపించారు. 1855 జూన్ 7న భోగనాదిహ్ గ్రామం కిక్కిరిసిపోయింది. ఎందుకంటే దాదాపు 10 వేల మంది సంతాల్ లు ఒక్కచోట సమావేశం అయ్యారు. ఈస్టిండియా కంపెనీతోపాటు తమను వేధిస్తున్న జమిందార్లకు, వడ్డీ వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా అటువైపు వారు స్పందించలేదు. అందుకే అప్పటి కలకత్తా జనరల్ ను కలవడానికి వెళ్తున్నప్పుడు ఆ తెగ పెద్దను అదుపులోకీ తీసుకున్నారు పోలీసులు.
తమ పెద్దను పోలీసులు నిర్బంధించారు అని తెలియగానే.. ఇక తిరుగుబాటే అని సంతాల్ లు ప్రకటించారు. దీంతో వారితో చర్చించమని అప్పటి ప్రభుత్వం కొందరు పోలీసులను పంపిస్తే.. వారి శవాలే వెనక్కి వచ్చాయి. ఈ ఘటనతో జమిందార్లు, వడ్డీ వ్యాపారులు కూడా ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వం దానిని సీరియస్ గా తీసుకుని సైన్యాన్ని ప్రయోగించింది. అలా ఏడాదిపాటు సంతాల్ లకు, తెల్లదొరలకు మధ్య యుద్ధం సాగింది. సుమారు 20 వేల మంది సంతాల్ లు ప్రాణాలు కోల్పోయారు. 1856 నాటికి ఆ యుద్ధం ముగిసినా, 1857 వరకు గెరిల్లా పోరాటం నడిచింది. ఇప్పుడు ద్రౌపది ముర్ము పేరు తెరపైకి రావడంతో.. ఆమె తెగ గురించి చర్చ జరుగుతోంది.