Eclipses – Darbha : భూమి, సూర్యుడు, చంద్రుడి మధ్య జరిగే చర్యల వల్ల గ్రహణాలు ఏర్పడుతుంటాయి. గ్రహణం అంటే కేవలం గ్రహాలలో మార్పు మాత్రమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలను అశుభ చర్యగా పరిగణిస్తారు. అందుకే గ్రహణాల సూతకాలం ప్రారంభం కాగానే పూజలను ఆపేస్తారు. ఆలయాల తలుపులను మూసేస్తారు. వీటితో పాటు గ్రహణం టైంలో ఆహార పదార్థాలపై దర్భలు వేస్తారు. ఇంతకీ ఈవిధంగా ఆహార పదార్థాాలపై దర్భలు ఎందుకు వేస్తారు ? దర్భలకు ఆహార పదార్థాలకు సంబంధం ఏమిటి ? అనే సందేహం చాలామందికి ఉంటుంది. గ్రహణం టైంలో వాతావరణంలో రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అతినీలలోహిత కిరణాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని హరించే శక్తి దర్భలకు ఉంటుందని నమ్ముతారు. అందుకే తినే పదార్థాలపై దర్భలను ఉంచుతారు. ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. ఇవి జలాన్ని శుభ్రపరుస్తాయి. విషానికి విరుగుడు కలిగించే గుణం ఉంటుంది. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో ధర్భలు వేసి ఉంచుతారు.
We’re now on WhatsApp. Click to Join.
దర్భలు.. విశేషాలు
- దర్భలు ఒక విధమైన గడ్డి జాతికి చెందిన మొక్కలు.
- శ్రీ రాముని స్పర్శ తో దర్భలు పునీతమయ్యాయి. అందుకే వీటిని పవిత్ర కార్యాలలో వాడుతారు.
- దర్భలను సంస్కృతం లో ‘అగ్ని గర్భం’ అంటారు.
- శుభం లేదా అశుభం ఏదైనా కానివ్వండి తప్పనిసరిగా దర్భలు వాడుతారు. యజ్ఞయాగాదుల్లో దర్భలను వాడుతారు. నిత్య అగ్నిహోత్రం దగ్గర నుంచి దేవతాప్రతిష్ఠల వరకు దర్భలేనిదే కార్యక్రమం జరగదు.
- కుంభాభిషేకాలలో, యాగశాలలోని కలశాలలో, బంగారు, వెండి తీగలతో పాటుగా దర్భలను తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు.
- దర్భలలో స్త్రీ, పురుష , నపుంసక జాతి దర్భలని మూడు రకాలు ఉన్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుంచి కొసదాకా సమానంగా ఉంటాయి. పై భాగంలో దళసరిగా ఉంటే అది స్త్రీ దర్భ. అడుగున దళసరిగా ఉంటే అది నపుంసక దర్భ.
- దర్భల దిగువ భాగం బ్రహ్మకు , మధ్యస్థానం మహావిష్ణువుకు , శిఖరభాగం పరమశివునికి నివాసంగా భావిస్తారు.
- వైదికకార్యాలలో “పవిత్రం” అనే పేరుతో దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు.
- ప్రేత కార్యాలలో ఒక దర్భతో, శుభ కార్యాలలో రెండు దర్భలతోను, పితృ కార్యాలలో మూడు దర్భలతోను, దేవ కార్యాలలో నాలుగు దర్భలతో ఉంగరాన్ని ముడి వేస్తారు.
- దేవతారాధన, జపం, హోమం, దానం తర్పణం వంటి కార్యాలలో దర్భతో చేసిన ‘పవిత్రం’ అనే ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి.
- ఆదివారం కోసిన దర్భలను ఒక వారంపాటు వాడొచ్చు. అమావాస్యనాడు కోసిన దర్భలను ఒక మాసం వరకు వాడొచ్చు. పౌర్ణమినాడు కోసి తెస్తే పదిహేను రోజులు వాడొచ్చు. శ్రావణమాసంలో కోసిన దర్భలను ఒక ఏడాది వాడొచ్చు. బాధ్రపద మాసంలో కోసిన దర్భలు ఆరుమాసాలు వాడొచ్చు.
- శ్రాధ్ధ కార్యాల కోసం తెచ్చిన దర్భలను ఏ రోజుకారోజే ఉపయోగించాలి.
- ప్రస్తుత కాలంలో ఎక్కువగా వాడే దర్భలను వశిష్ట దర్భ లేదా విశ్వామిత్ర దర్భలుగా(Eclipses – Darbha) పిలుస్తుంటారు.
Also Read: Mouse – Space : అంతరిక్షంలో ఎలుకల పిండాలు.. ఏమైందంటే ?
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.