Site icon HashtagU Telugu

Step Up Home Loan : స్టెప్ అప్ హోంలోన్.. స్టెప్ డౌన్ హోంలోన్ గురించి తెలుసా ?

Home Loan

Step Up Home Loan :  సొంత ఇల్లు ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అందరూ సొంతింటి కోసం కలలు కంటుంటారు. ప్రత్యేకించి ఉద్యోగులు ఇంటిని కట్టుకునేందుకు హోం లోన్ తీసుకుంటుంటారు. ప్రతినెలా వాటికి సంబంధించిన ఈఎంఐలు చెల్లిస్తుంటారు. కొంతమంది ఈఎంఐల భారం గురించి విని భయపడి హోం లోన్ తీసుకునేందుకు సాహసించరు. అలాంటి వారికి ఉపయోగపడే రుణ సదుపాయమే స్టెప్‌ అప్‌ హోమ్‌లోన్‌.  వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

సాధారణ హోం లోన్ -ఈఎంఐ

మనం తీసుకునే సాధారణ హోం లోన్‌‌‌కు సంబంధించిన ఈఎంఐలో తొలినాళ్లలో వడ్డీ భాగం అధికంగా, అసలు భాగం తక్కువగా ఉంటుంది. ఏళ్లు గడిచేకొద్దీ చెల్లించే మొత్తంలో అసలు భాగం పెరుగుతూపోతుంది. అయితే ఈఎంఐ మొత్తంలో మాత్రం ఎలాంటి మార్పు కూడా జరగదు.

స్టెప్ అప్ హోంలోన్ -ఈఎంఐ

స్టెప్‌ అప్‌ హోం లోన్‌ ఈఎంఐ అమౌంటుకు సంబంధించిన స్ట్రక్చర్ భిన్నంగా ఉంటుంది. ఈ తరహా హోం లోన్‌లో ఈఎంఐ మొత్తం తొలినాళ్లలో తక్కువగానే ఉంటుంది. కాలక్రమేణా ఈఎంఐ అమౌంట్ పెరుగుతూపోతుంది.  కెరీర్ గ్రోత్, శాలరీ గ్రోత్‌కు అనుగుణంగా ఈఎంఐ భారాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడే వారికి స్టెప్ అప్ హోం లోన్ సదుపాయం చాలా ఉపయోగపడుతుంది.

Also Read :Russian Army Shoes : రష్యా ఆర్మీ బూట్లు.. మన దేశంలోనే తయారవుతాయి తెలుసా ?

శాలరీ పెరిగే అవకాశాలు ఉంటేనే..

స్టెప్‌ అప్‌ హోం లోన్‌‌లో ఈఎంఐల కాలవ్యవధి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈఎంఐ అమౌంట్ తగ్గుతుంది. ఈ లోన్ తీసుకునే వారికి ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. వేతనం కచ్చితంగా భవిష్యత్తులో పెరుగుతుందనే విశ్వాసం ఉంటేనే ఈ లోన్ తీసుకోవడం మంచిది. ఒకవేళ శాలరీ మీ అంచనాలకు అనుగుణంగా పెరగకుంటే ఈఎంఐలు చెల్లించే విషయంలో కష్టపడాల్సిన దుస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఈ రకం హోంలోన్‌లో ఈఎంఐ అమౌంట్ క్రమంగా పెరుగుతూపోతుంది. ఈఎంఐ కాలవ్యవధి ఎక్కువగా ఉండటంతో అంతమేరకు వడ్డీ భారాన్ని మోసేందుకు  లోన్ తీసుకున్న వ్యక్తి  సిద్ధపడాలి.

స్టెప్‌- డౌన్‌ హోం లోన్..

స్టెప్ డౌన్ హోంలోన్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ రకం హోం లోన్ తీసుకుంటే కాలక్రమేణా ఈఎంఐ మొత్తం తగ్గుతూపోతుంది. ఇప్పటికే  కెరీర్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నవారు ఈ రకం హోం లోన్ తీసుకుంటే బెటర్. భవిష్యత్తులో ఏమైనా ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునేందుకు స్టెప్ డౌన్ హోం లోన్ ఆప్షన్ దోహదం చేస్తుంది. ఎందుకంటే.. కాలక్రమేణా నెలవారీ ఈఎంఐ మొత్తం అనేది తగ్గుతూపోతుంది. దీనివల్ల రుణం తీసుకున్న వ్యక్తిపై ఈఎంఐ భారం తగ్గుతుంది. అయితే మొదట్లో ఎక్కువ మొత్తంలో ఈఎంఐ కట్టేందుకు రెడీ కావాలి.