Zawahari & US Attack: అల్ ఖైదా ఉగ్రవాది అల్ జవహరిని అమెరికా ఎలా మట్టుబెట్టిందో తెలుసా?

అల్ ఖైదా నాయకుడు అల్ జవహిరిని అమెరికా డేగ కండ్లతో వెంటాడి వెతికి మరీ మట్టుబెట్టింది.

  • Written By:
  • Updated On - August 3, 2022 / 10:21 AM IST

అల్ ఖైదా నాయకుడు అల్ జవహిరిని అమెరికా డేగ కండ్లతో వెంటాడి వెతికి మరీ మట్టుబెట్టింది. అది కూడా ప్రస్తుతం తాలిబన్లు ఏలుతున్న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ గడ్డపై. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం లేదు. అయినా కాబూల్ లోని ఓ బిల్డింగ్ లో నివసిస్తున్న అల్ జవహరీని అమెరికా ఎలా కడతేర్చగలిగింది ? అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది. దీనికి సమాధానం దొరకాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

2021 ఆగస్టు నుంచే షురూ..

అల్ ఖైదా నాయకుడు అల్ జవహిరిని మట్టు పెట్టే ప్లాన్ ఒక్క రోజులో తీసుకున్నది కాదు!! 2021 ఆగస్టు నుంచే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను అమెరికా స్టార్ట్ చేసింది. సరిగ్గా అదే నెలలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ గద్దెను ఎక్కారు. అక్కడి నుంచి అమెరికా సైన్యం వైదొలిగింది. అయితేనేం అమెరికా నిఘా విభాగాలు సైలెన్స్ గా అనుకున్న పని కానించాయి. తాలిబన్లు గద్దెను ఎక్కిన తర్వాత రాజధాని కాబూల్ లో మళ్ళీ యాక్టివేట్ అయిన ఉగ్రవాదుల జాబితాను తయారు చేసింది. ఇందులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అమెరికాను వణికించిన 9/11 ఉగ్ర దాడుల మాస్టర్ మైండ్ అల్ జవహిరి కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అమెరికా నిఘా విభాగాలు కాబూల్ లో గ్రౌండ్ వర్క్ చేశాయి. నివాస స్థలం, పరిసర ప్రాంతాల వివరాల్ని సేకరించాయి. ఇదంతా గత ఏడాదే జరిగింది.

ఈ ఏడాది ఏప్రిల్ లో మొదలెట్టి..

తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ లో మరోసారి దీనిపై అమెరికా కసరత్తు చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జెక్ సలీవన్ .. అల్ జవహరీ ఆచూకిపై నిఘా వర్గాలతో చర్చించారు. అల్ జవహరిని మట్టు పెట్టె ప్లాన్స్ తయారు చేశారు. ఆ వివరాలన్నీ అధ్యక్షుడు జో బైడెన్ కు జూలైలో సమర్పించాలని నిర్ణయించారు. వాటిని పరిశీలించిన బైడెన్ .. జులై 25 తర్వాత ఆ ప్లాన్స్ కు పచ్చ జెండా ఊపారు. అయితే ఒక షరతు పెట్టారు. 2021 సంవత్సరంలో కాబూల్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అమాయక ప్రజలు కూడా చనిపోయారు. మళ్ళీ అలాంటి పర్యవసానాలు ఉండరాదని బైడెన్ నిర్దేశించారు. దీంతో జవహరీని ఖతం చేసే మిషన్ జులై చివరి వారంలో మొదలైంది. ఇందులో భాగంగా కాబూల్ లో అల్ జవహరి ఉంటున్న ఇంటి స్వరూప స్వభావ సమాచారాన్ని సేకరించారు. గత కొన్ని నెలల అల్ జవహరి దిన చర్య వివరాలను రాబట్టారు. రోజూ అల్ జవహరి ఏ సమయంలో ఇంటి బయటికి వస్తారనే సమాచారం కూడగట్టారు. ఆయన ఇంటి బయటికి రావడం లేదని.. రోజూ రాత్రి కాసేపు ఇంటి బాల్కనీలోకి వచ్చి నిలబడతారని కాబూల్ లోని అమెరికా గూఢచారుల ద్వారా తెలుసుకున్నారు. అందుకు అనుగుణంగా అల్ జవహరిని మట్టుపెట్టే ప్లాన్ తయారు చేశారు.

Attack Map

 

యూఏఈ నుంచి పాక్ మీదుగా కాబూల్ కు డ్రోన్..

అతడిని చంపే డ్రోన్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి అమెరికా పంపింది. అది పాకిస్థాన్ భూభాగం మీదుగా కాబూల్ లోకి వెళ్ళింది. జులై 30న ఆఫ్ఘనిస్తాన్ సమయం ప్రకారం రాత్రి 9.48కి ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్న అల్ జవహరిపై అమెరికా డ్రోన్ ‘హెల్‌ఫైర్’ అనే రెండు మిసైల్స్ ప్రయోగించింది. ఈ డ్రోన్ ఎటాక్‌ను సీఐఏ పర్యవేక్షించింది. మిసైల్స్ ప్రయోగించిన సమయంలో అల్ జవహరి సమీపంలో ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు గుర్తించారు. కానీ వారికి ఏమీ కాలేదని, అల్ జవహరి మాత్రమే చనిపోయాడని వెల్లడించారు. ఈమేరకు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ఖండించిన తాలిబన్లు..

అయితే ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్న తాలిబన్లు ఖండించారు. తమ దేశం అనుమతి తీసుకోకుండా కాబూల్ లో డ్రోన్ దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని పేర్కొన్నారు. కాగా,కాబూల్ లో హక్కాని నెట్ వర్క్ అనే ఉగ్రవాద సంస్థ అల్ జవహరికి ఇన్నాళ్లు సెక్యూరిటీ ఇచ్చిందని అంటున్నారు.