Biden – Xi – Three : అమెరికా, చైనా.. రేపే ‘మూడు’ ముచ్చట్లు!

Biden - Xi - Three : చాలా గ్యాప్ తర్వాత బుధవారం రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ భేటీ కాబోతున్నారు.

  • Written By:
  • Updated On - November 14, 2023 / 01:33 PM IST

Biden – Xi – Three : చాలా గ్యాప్ తర్వాత బుధవారం రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ భేటీ కాబోతున్నారు. రేపు (బుధవారం) అమెరికాలోని  శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా 30వ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశం వేదికగా షి జిన్‌పింగ్‌, బైడెన్ సమావేశం అవుతారు. ఈ సదస్సులో 21 దేశాల నేతలు పాల్గొనబోతున్నారు. ఈ సమావేశాల్లో ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరుగుతుందనేది పాత ముచ్చటే. వాస్తవం ఏమిటంటే.. ఈసారి ఇద్దరు నేతల భేటీలో ప్రధానంగా మూడు ముఖ్యమైన అంశాలు చర్చకు రాబోతున్నాయి. అవేమిటంటే..

We’re now on WhatsApp. Click to Join.

అమెరికాకు ఫెంటానిల్ దడ .. ఏమిటిది ?

బైడెన్ – జిన్‌పింగ్ మీటింగ్ ఎజెండాలో మొట్టమొదటి అంశం ఫెంటానిల్. ఇది శక్తివంతమైన సింథటిక్ ఓపియాయిడ్. ఫెంటానిల్.. మాదక ద్రవ్యం మార్ఫిన్ కంటే 60 రెట్లు శక్తివంతంగా ఉంటుంది. వాస్తవానికి దీన్ని నొప్పి నివారణకు వాడుతుంటారు. కానీ చైనాకు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలు మార్ఫిన్ కంటే 10వేల రెట్లు ఎక్కువ పవర్ ఫుల్‌గా ఉండే ఫెంటానిల్‌ డ్రగ్ ఫార్ములాను తయారు చేసి అమెరికా ఔషధ మార్కెట్‌కు సప్లై చేస్తున్నాయి. అమెరికాలో ఎంతోమంది ఫెంటానిల్ వ్యసనం బారినపడ్డారు.1999 సంవత్సరం నుంచి ఇప్పటివరకు అమెరికాలో 10 లక్షల మందికిపైగా ప్రజలు మాదకద్రవ్యాల వ్యసనం బారినపడ్డారు. ఇందులో ఫెంటానిల్ బాధితులు కూడా లక్షల్లోనే ఉంటారు. ఈనేపథ్యంలో చైనా నుంచి అమెరికాకు ఫెంటానిల్ సప్లై జరగకుండా నిరోధించే అంశంపై జిన్‌పింగ్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలనే ప్లాన్‌లో అమెరికా ఉంది.  తద్వారా అమెరికాకు ఫెంటానిల్ అక్రమ సప్లైకి బ్రేక్ పడుతుందని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది.

ఉత్తరకొరియా ఉద్రిక్తత

దక్షిణ కొరియాను ఉత్తర కొరియా కవ్విస్తోంది. దక్షిణ కొరియా సముద్ర జలాల్లోకి అమెరికా యుద్ధ నౌకలు ప్రవేశించడంపై ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల నిప్పులు కక్కారు.  అంతేకాదు కిమ్ ఇటీవల రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో బిజీగా ఉన్న రష్యాకు ఆయుధాలను సప్లై చేసేందుకు కిమ్ అంగీకరించారు. దీనికి ప్రతిఫలంగా అధునాతన మిస్సైళ్ల తయారీ టెక్నాలజీని ఉత్తర కొరియాకు బదిలీ చేసేందుకు పుతిన్ అంగీకరించారు. ఉత్తర కొరియాతో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఉత్తర కొరియాను కట్టడి చేయాలని చైనాకు సూచనలు చేయాలని బైడెన్ యోచిస్తున్నారట.

ఇజ్రాయెల్ – గాజా యుద్ధం

ఇజ్రాయెల్ – గాజా యుద్ధంలో ఇరాన్ కీలక పాత్ర పోషిస్తోంది. గాజాలో ఉన్న హమాస్‌ మిలిటెంట్లకు, లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లకు, యెమన్‌లో ఉన్న హౌతీ మిలిటెంట్లకు, సిరియాలో ఉన్న పలు మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు, ఆర్థికసాయం అందిస్తోంది. గాజాపై నుంచి ఇజ్రాయెల్ ఫోకస్‌ను మరల్చేందుకు ఇవన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నాయి. దీంతో గాజా యుద్ధం బహుముఖంలోకి మారింది. ఇరాన్ నేరుగా యుద్ధంలోకి దూకకున్నా.. దాని సపోర్ట్ కలిగిన మిలిటెంట్ గ్రూపులు యుద్ధంలో నిమగ్నమయ్యాయి. ప్రపంచంలో ఇరాన్ చమురును అత్యధికంగా కొనుగోలు చేసే దేశం చైనానే. గాజా యుద్ధంలోకి దూకకుండా ఉండేలా ఇరాన్‌ను కట్టడి చేయాలని చైనా అధ్యక్షుడిని బైడెన్ కోరే(Biden – Xi – Three) అవకాశం ఉంది.