Site icon HashtagU Telugu

Uniform Civil Code Explained : యూనిఫామ్ సివిల్ కోడ్.. ఏమిటి ? మీ అభిప్రాయం సమర్పించడం ఎలా ?

Uniform Civil Code Explained

Uniform Civil Code Explained

Uniform Civil Code Explained : యూనిఫామ్ సివిల్ కోడ్..

ఇప్పుడు దీనిపై వాడివేడి చర్చ జరుగుతోంది.. 

వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాలలో దేశ పౌరులందరికీ వర్తించే ఒకే చట్టాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ సూచిస్తుంది.

ప్రస్తుతం మత ప్రాతిపదికన వివిధ కమ్యూనిటీలకు వేర్వేరు పర్సనల్ లా (వ్యక్తిగత చట్టాలు) అమల్లో ఉన్నాయి.

మతం, లింగం, కులం మొదలైన వాటితో సంబంధం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించే చట్టాలను ప్రవేశపెట్టాలనేది యూనిఫామ్ సివిల్ కోడ్ టార్గెట్. 

ప్రజలు, మత సంస్థల అభిప్రాయాల సేకరణ 

యూనిఫాం సివిల్ కోడ్ పై(Uniform Civil Code Explained) అభిప్రాయాలను కోరుతూ 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా జూన్ 14న (బుధవారం) ఒక నోటీసు జారీ చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ పై ప్రజలు, గుర్తింపు పొందిన మత సంస్థల అభిప్రాయాలను కమిషన్ ఆహ్వానించింది. “యూనిఫాం సివిల్ కోడ్ పై సంప్రదింపులు జరపాలని  2018 ఆగస్టులో 21వ లా కమిషన్ చేసిన సూచనల మేరకు ఇప్పుడు ఆ ప్రక్రియను ప్రారంభించాం” అని జస్టిస్ రితురాజ్ అవస్తీ అధ్యక్షత వహిస్తున్న 22వ లా కమిషన్ తెలిపింది. జూన్ 30లోపు ప్రజలు యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించి తమ అభిప్రాయాలను సమర్పించాలి. లా కమిషన్ వెబ్‌సైట్‌లోని ‘ఇక్కడ క్లిక్ చేయండి’ బటన్ ద్వారా లేదా membersecretary-lci@gov.inకు ఈ-మెయిల్ ద్వారా అభిప్రాయాలు సబ్మిట్ చేయొచ్చు. యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించిన వివరణాత్మక అభిప్రాయాన్ని సభ్య కార్యదర్శి, లా కమిషన్ ఆఫ్ ఇండియా, 4వ అంతస్తు, లోక్ నాయక్ భవన్, ఖాన్ మార్కెట్, న్యూఢిల్లీ – 110 003కు కూడా పంపొచ్చు. కమిషన్ వ్యక్తులు లేదా ప్రతినిధులను కూడా ఆహ్వానించవచ్చు.

యూనిఫాం సివిల్ కోడ్ పై చర్చ ఏమిటీ ?

“దేశంలోని పౌరులందరినీ సౌరక్షించడానికి ఒకే విధమైన సివిల్ కోడ్‌ ద్వారా దేశం ప్రయత్నిస్తుంది” అని భారత రాజ్యాంగం అధ్యాయం-4లోని ఆర్టికల్ 44 చెబుతోంది. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తామని బీజేపీ 1998, 2019 ఎన్నికల మేనిఫెస్టోల్లో వాగ్దానం చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును నారాయణ్ లాల్ పంచారియా 2019 నవంబరులో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్షాల వ్యతిరేకతతో దాన్ని ఉపసంహరించుకున్నారు. కిరోడిలాల్ మీనా ఈ బిల్లును 2020 మార్చిలో మళ్లీ తీసుకొచ్చారు. కానీ.. దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. దేశంలోని వివిధ కుటుంబ చట్టాల్లోని కొన్ని పద్ధతులు మహిళల పట్ల వివక్ష చూపేలా ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని 2018 నాటి లా కమిషన్ చర్చల్లో అభిప్రాయం వ్యక్తమైంది. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వానికి సంబంధించిన చట్టాల్లో సమానత్వం కోరుతూ సుప్రీంకోర్టు వద్ద చాలా పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి.

వివిధ కేసులు..యూనిఫాం సివిల్ కోడ్ ప్రస్తావన 

ఎన్నో చిక్కుముడులు ..

మహిళలకు రక్షణ, విడాకులు, సంరక్షకత్వం, వారసత్వానికి సంబంధించిన చట్టాల నియంత్రణను కోరుతూ అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఇస్లామిక్ చట్టాలు అనుమతిస్తున్న తక్షణ విడాకులు (తలాక్-ఎ-బైన్), కాంట్రాక్ట్  వివాహం (ముటా), విడాకుల విషయంలో మరో వ్యక్తితో స్వల్పకాలిక వివాహం (నికాహ్ హలాలా) వంటి వివక్ష పూరిత విధానాలకు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు ఎన్నో పిటిషన్లు దాఖలు చేశారు. సిక్కుల వివాహ చట్టాలు 1909 ఆనంద్ వివాహ చట్టం కింద కవర్ అయ్యాయి. అయితే విడాకుల కోసం వారికి నిబంధనలు లేకపోవడంతో సిక్కుల విడాకులకు హిందూ వివాహ చట్టాలనే అమలు చేస్తున్నారు.

Also read : Pakistan Jail: 27 నెలలు పాకిస్థాన్ జైలులో ఉన్న ఓ భారతీయుడి కన్నీటి గాథ ఇదే

‘సహజీవనం’ కేసులు పెరగడంతో..

ప్రస్తుతం ‘వివాహానికి సమానంగా’ కోర్టులు గుర్తిస్తున్న ‘సహజీవనం’ కేసులు పెరగడంతో చట్టవిరుద్ధమైన పిల్లల వారసత్వ హక్కులను కూడా గుర్తించాలని  2008లో  లా కమిషన్ సిఫారసు చేసింది. హిందువుల్లో వారసత్వ చట్టాల సంస్కరణలను చేయాలని  సూచించింది. మహిళల స్వీయ ఆర్జిత ఆస్తి సమస్యను కూడా ప్రస్తావించింది. పార్సీలతో సహా వివిధ మతాల మధ్య వారసత్వ చట్టాలను క్రమబద్ధీకరించాలని చెప్పింది. అయితే మార్పుల ప్రతిపాదనలపై అప్పట్లో మత సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో చట్టానికి సవరణలు సాధ్యం కాలేదు.

దత్తత చట్టాలు.. తీరొక్క వైవిధ్యం 

దత్తత చట్టాలు ఒక్కో మతంలో ఒక్కోలా ఉంటాయి. పార్సీలనే తీసుకుంటే.. వారు కుమార్తెల దత్తతను గుర్తించరు. దత్తపుత్రుడికి అంత్యక్రియలు చేసే హక్కు మాత్రమే కల్పిస్తారు. జొరాస్ట్రియన్ల పద్ధతి ప్రకారం.. వారసత్వం, నిర్వహణ యొక్క ఇతర హక్కులు లేవు. దత్తత చట్టాన్ని మార్చాలన్న ప్రతిపాదనలకు ఆ సంఘం నుంచి వ్యతిరేకత ఎదురైంది. మైనర్ ల సంరక్షకుల విషయంలోనూ వేర్వేరు కమ్యూనిటీలకు వేర్వేరు హక్కులున్నాయి. తల్లిదండ్రుల బాధ్యతలు, హక్కుల విషయంలోనూ వివిధ కమ్యూనిటీల్లో తేడాలున్నాయి. మరణించిన పురుషులు, మరణించిన మహిళల వారసుల మధ్య వివక్షను తొలగించడానికి హిందూ వారసత్వ చట్టాన్ని మార్చాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి.

ఆస్తి హక్కులో మహిళలకు న్యాయం జరిగేనా ?

మహిళలకు ఆస్తి హక్కు విషయంలో వివిధ మతాల్లోని వివిధ కమ్యూనిటీల్లోనూ భారీ వ్యత్యాసాలను లా కమిషన్ గుర్తించింది. షెడ్యూల్డ్ తెగల సంస్కృతిక పద్ధతులకు ప్రత్యేక రక్షణ కల్పించారు. ఉదాహరణకు.. మేఘాలయాలోని కొన్ని తెగలు “మాతృస్వామ్యాన్ని అనుసరిస్తారు. అంటే.. వారు స్త్రీల వంశాన్ని అనుసరిస్తారు. చిన్న కుమార్తె ద్వారా ఆస్తి సంక్రమిస్తుంది. గారో తెగల్లో అల్లుడు.. తన భార్య తల్లిదండ్రులతో నివసించడానికి ఇల్లరికం వస్తాడు. నాగాల్లోని కొన్ని తెగల్లో మహిళలకు ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు లేదు. తెగ బయటి వారిని పెళ్లి చేసుకునేందుకు అనుమతించరు. యూనిఫాం సివిల్ కోడ్‌ను రూపొందించేటప్పుడు సాంస్కృతిక పద్ధతుల్లోని ఈ వ్యత్యాసాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.