ఉగాది అంటేనే తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉ అంటే నక్షత్రం, గ అంటే గమనం, నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాది పండుగగా జరుపుకుంటాం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగా జరుపుకోబడుతుంది. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.
ఉగాది ప్రాముఖ్యత గురించి:
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. మన ప్రసిద్ధ పురాణాల ప్రకారం, ఉగాది రోజున బ్రహ్మ దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని, ఈ క్రమంలో బ్రహ్మ దేవుడు కాలాన్ని రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలను ఇదే రోజున పరిచయం చేశాడని ప్రసిద్ధ గ్రంధాలు చెబుతున్నాయి. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.
ఉగాది అనే పదం ఉగస్య అనే పదం నుండి వచ్చింది. ఉగ అంటే నక్షత్ర గమనం- జన్మ ,ఆయుష్షు అని కూడా దానికి అర్ధం. ఆది అంటే మొదలు లేదా ప్రారంభం. అంటే ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అని అయ్యింది. భారత దేశ సాంప్రాదాయము ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అంటే ఈ ఉగాది రోజునే సృష్టి జరిగింది అని పురాణాల నుండి చెప్పడం జరిగింది. ఉగాది చైత్ర మాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులుతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి తెలుగు వారు ఈ పండుగని బాగా జరుపుకుంటారు. ఇదే సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కనుక కొత్తగా పనులని ప్రారంభిస్తారు.
పండుగ రోజు చక్కగా తెల్లవారే నిద్ర లేచి ఇల్లు, పరిసరాలు శుభ్ర పరుచుకుని, మామిడి తోరణాలతో అలంకరించి, తల స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇక అన్నింటి కంటే ముఖ్యమైంది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని అనేక ప్రాంతాల వాళ్ళు అనేక విధాలుగా చేసుకుంటారు. అయితే ఇందులో ప్రత్యేకం అయినవి షడ్రుచులు. మధురం, ఆమ్లం, లవణం, కటు, తిక్త, కషాయం. ఇలా ఈ ఆరు రుచులు ఉగాది పచ్చడిలో ప్రదానం. మధురం అంటే తీపి,ఆమ్లం అంటే పులుపు ,లవణం అంటే ఉప్పు, కటు అంటే కారం, తిక్త అంటే చేదు, కషాయం అంటే వగరు.. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఎదురయ్యేది కష్టమైన సుఖమైనా సంయమనంతో ప్రతి ఒక్కరు స్వీకరించాలి అని మన ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఒకొక్కరు ఒక్కో విధంగా పచ్చడిని తయారు చేస్తారు. అయితే ఈ పచ్చడిలో చెరకు అరటి పళ్ళు, మామిడి కాయలు, చింతపండు, వేప పువ్వు, జామ కాయలు, బెల్లం వగైరా పదార్దాలను వాడుతారు. హిందువులుకి అత్యంత శ్రేష్ఠమైన పండుగ ఉగాది. ఇక ఈ ఉగాది పండుగను తెలుుగువారే కాకుండా మరఠీలు, తమిళులు, మలయాళీలు, బెంగాలీలు, సిక్కులు కూడా జరుపుకుంటారు. మరాఠీలు ఈరోజును గుడిపడ్వా అనే పేరుతో, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖీ అనే పేరుతో, బెంగాలీలు పోయ్‌లా బైశాఖ్ అనే పేరుతో జరుపుకుంటారు.
ఉగాది పచ్చడి గురించి:
ఉగాది ప్రత్యేకతల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఉగాది పచ్చడి గురించి తెలుసుకోవాలి. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. వసంత ఋతువు ఆగమనమైన రోజు, ఈ రోజున షడ్రుచులు కలిపిన పచ్చడిని తింటారు. షడ్రుచులు కల్గిన ఈ పచ్చడిని తీపి,పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే రుచులు గల బెల్లం, చింతపండు ఉప్పు, కారం, వేపపూవు, మామిడికాయలు తగిన మోతాదులో మన రుచికి తగినట్టుగా తయారు చేస్తారు. బెల్లం- తీపి, ఆనందానికి ప్రతీక అయితే, ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలకు ప్రతీక అయితే, చింతపండు- పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. ఇక పచ్చి మామిడి ముక్కలు- వగరు, కొత్త సవాళ్లకు ప్రతీక అయితే కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను సూచిస్తుంది.
ఉగాది గురించి చివరిగా:
ఉగాది రోజున తెలుగు వారు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తోంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరం మన సిత్తిగత్తులను ముందే తెలుసుకోవచ్చు. ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణం తిధి, వారం, నక్షత్రం, యోగం,కారణం అనే ఐదు అంశాల గూర్చి ప్రస్తావిస్తారు. ఇక మూడవది కవి సమ్మేళనం సాయంకాలం కవులు ఒక చోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఇందులో కవితలు, పద్యాలు పాడుకోవడం అనేది జరుగుతుంది. గత సంవత్సరం జరిగినవన్నీ మరచి పోయి ఆనందంగా ఈ కొత్త సంవత్సరం ఉగాది పండుగను జరుపుకోవాలని కోరుకుందాం. ఈ ఉగాది రోజునే వసంత నవరాత్రి పేరిట వివిధ ఆలయాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొంటే ఆ దేవుడి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాదు ఉత్తర భారతీయులు ఉగాదిని జరుపుకోరు కానీ అదే రోజున తొమ్మిది రోజుల చైత్ర నవరాత్రి పూజను ప్రారంభిస్తారు. కావున సాయంత్రం వేళ మర్చిపోకుండా దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి పంచాంగ శ్రవణాన్ని తప్పకుండా వినండి.
Hashtagu.. వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.