KCR Strategy: కేసీఆర్ ‘సోషల్’ వారియర్!

‘‘రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు చాలా ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్టుగా కార్యాచరణ మార్చుకోవాల్సి ఉంటుంది.

  • Written By:
  • Updated On - May 16, 2022 / 04:25 PM IST

‘‘రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు చాలా ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్టుగా కార్యాచరణ మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టాలంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకూడదు’’ ఇప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ అదే పనిచేస్తోంది. టెక్నాలజీ వాడకం పెరగడం, యువత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుండటంతో టీఆర్ఎస్ పార్టీ టెక్నాలజీ బాట పడుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సోషల్ మంత్రాన్ని జపిస్తోంది. తమ రాజకీయ ప్రత్యర్థులైన అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడటంటో పాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘సోషల్ మీడియా’ గ్రూప్స్ ను నిర్వహించబోతోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా బూత్, గ్రామ స్థాయిల నుంచి దాదాపు లక్ష మంది ‘సోషల్ మీడియా’ యాక్టివిస్ట్స్ తయారవుతున్నారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ప్రచారానికి తోడు..  ఈ సోషల్ వింగ్ కలిస్తే.. టీఆర్ఎస్ మరింత బలమైన రాజకీయ శక్తిగా అవతరించబోతోంది.

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో యువకులు కొత్త ఓటర్లుగా మారనున్నారు. అయితే వారందరినీ అంత ఈజీగా ప్రభావితం చేయడం చాాలా కష్టం. అందుకే ‘టీఆర్‌ఎస్’ నాయకత్వం గతంలో తనకు అనుకూలంగా ఉన్న తెలుగు వార్తా ఛానళ్లపై చాలా తక్కువగా ఆధారపడాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయా ఛానళ్లు తమ రాజకీయ స్టాండ్ మార్చుకోవడంతో పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తాయోమోనని అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోషల్ మీడియా యోధులకు శిక్షణ ఇచ్చారు. అధికార పార్టీ ప్రధాన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి పార్టీ నాయకులు, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండటం అవసరమని మంచిర్యాల జిల్లాకు చెందిన సీనియర్ టీఆర్‌ఎస్ నాయకుడు అన్నారు. ఈ టీఆర్‌ఎస్ సోషల్ మీడియా యోధులు ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో యాక్టివ్‌గా ఉంటూ పార్టీకి సంబంధించిన సానుకూల సమాచారాన్ని ప్రచారం చేస్తూ ప్రత్యర్థులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టనున్నారు.

ఈ సోషల్ సైన్యమంతా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త అకౌంట్స్ ను తెరవబోతున్నారు. టీఆర్‌ఎస్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సొంతంగానూ తమ పేరిట అకౌంట్స్ ఓపెన్ చేయనున్నారు. ఈ సైన్యం కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పార్టీకి ‘ఫీల్ గుడ్’ ఇమేజ్ ఏర్పడుతుంది. అందుకే టీఆర్‌ఎస్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సోషల్ మీడియా వారియర్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం టీఆర్‌ఎస్ సానుభూతిపరులు, ముఖ్యంగా విద్యావంతులైన యువతను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను ప్రధానంగా ఎత్తిచూపుతూ, ప్రభుత్వంపై ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా యోధులకు పూర్తి శిక్షణ ఇస్తున్నారు. పనిచేసిన సైన్యాన్ని కొంత నగదు ఇవ్వడమే కాకుండా.. భవిష్యత్తులో వారికి పార్టీ పదవులు కట్టబెట్టనున్నట్టు ప్రచారం జరుగుతోంది.