Site icon HashtagU Telugu

Solar Eclipse From Space: ఆకాశం నుంచి సూర్య గ్రహణం చూద్దాం రండి!

Solar Eclipse

Solar Eclipse

సూర్య గ్రహణాన్ని మనం భూమి నుంచి చూస్తుంటాం. దాన్ని ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా ? అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడే చూడండి.. నాసాకు చెందిన సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ (ఎస్డీఓ) అనే వ్యోమ నౌక సూర్య గ్రహణం ఫోటోలను ఆకాశం నుంచి తీసి భూమికి పంపింది.

సూర్యుడిలో జరిగే పరిణామాలపై ఓ కన్నేసి పెట్టేందుకు ఈ వ్యోమ నౌకను నాసా ప్రయోగించింది. ఇది 2010 సంవత్సరం నుంచే సూర్యుడిలో జరిగే పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ.. ఫోటోలు, వీడియోలు తీసి పంపుతోంది. తాజాగా అది పంపిన దృశ్యంలో.. సూర్య గ్రహణం వేళ సూర్యుడి ఎదుటి నుంచి చంద్రుడు పక్కకు వెళ్లిపోవడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

దాదాపు 35 నిమిషాల పాటు సంభవించిన ఈ పరిణామాన్ని సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ వ్యోమ నౌక తన కెమెరాల్లో బంధించి నాసాకు పంపింది. సూర్య గ్రహణ సమయంలో దాదాపు 67 శాతం సూర్యుడి ఉపరితలానికి చంద్రుడు అడ్డుగా వచ్చినట్లు గుర్తించారు.

ఈ సమయంలో సూర్యుడి కాంతి తేజానికి.. సూర్యుడికి పూర్తి ఎదురుగా చంద్రుడి ఉపరితలంపై ఉన్న భూభాగం ఒక్కసారిగా వెలుగుల్లో నిండిపోయిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక ఇదే సూర్య గ్రహణ సమయంలో సూర్యుడి ఉత్తరార్ధ గోళంలో మరో కీలక పరిణామం జరిగిందని తెలిపారు. అదేమిటంటే.. ఆ ప్రాంతంలో ఆవరించి ఉన్న సౌర పవనాల్లో అంతర్గతంగా ఒక పేలుడు కూడా సంభవించింది. అదృష్టవశాత్తు దాని తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనల్ మాస్ ఎజెక్షన్ కు దారి తీయలేదని వివరించారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ ఎంత శక్తివంతమైనది అంటే.. దీనివల్ల సంభవించే సౌర తుఫాను అలలు కాంతి వేగంతో ప్రయాణించి కేవలం 8 నిమిషాల్లో భూమిని చేరగలవు.