Auto Ambulance: ఆటోను అంబులెన్స్ గా మార్చి.. మూగజీవాలను కాపాడి!

మానవత్వం కనుమరుగైన పోతున్న ఈ రోజుల్లో ఓ ఆటో డ్రైవర్ మూగ జీవాల రక్షణ కోసం పరితపిస్తున్నాడు.

  • Written By:
  • Updated On - April 11, 2022 / 03:35 PM IST

మానవత్వం కనుమరుగైన పోతున్న ఈ రోజుల్లో ఓ ఆటో డ్రైవర్ మూగ జీవాల రక్షణ కోసం పరితపిస్తున్నాడు. వాటికి నిత్యం సపర్యలు చేస్తూ.. ఆహారం పెడుతూ ముగజీవాల నేస్తంగా మారాడు. అంతేకాదు.. గాయపడిన జంతువుల రక్షణ కోసం తన ఆటోను అంబులెన్స్ గా మార్చి మరి చికిత్స చేయిస్తున్నాడు ఆటో డ్రైవర్ భాస్కర్. ‘‘గత వారం నేను చెన్నైలోని మా ఇంటి వెలుపల అనారోగ్యంతో ఉన్న కుక్కపిల్లని చూశాను. నొప్పితో కదలలేక విలవిలలాడుతోంది. కనీసం నీటిని కూడా తాగలేని విధంగా ఉంది. ఆ కుక్కపిల్లకు పాలు పట్టి గంట తర్వాత ‘జంతు రెస్క్యూ షెల్టర్‌’లకు డయల్ చేశా. అయితే ఆరోజు సండే కావడంతో ఎటువంటి స్పందన లేదు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ ఎన్ భాస్కర్ గురించి తెలిసింది. ఆయనకు ఫోన్ చేసిన తర్వాత నిమిషాల్లోనే స్పాట్‌కు చేరుకున్నాడు. చికిత్స చేసి కాపాడాడు‘‘ అని  ఓ జంతు ప్రేమికుడు తెలిపాడు.

చెన్నైకు చెందిన భాస్కర్ గత మూడేళ్లుగా కుక్కలు, కుక్కపిల్లలు, పిల్లులకు, ఇతర మూగజీవాల రక్షణ కోసం పాటు పడుతున్నాడు. ‘‘నేను కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతున్నా. అయితే మూగజీవాలు గాయపడుతుండటం, సకాలంలో అంబులెన్స్ లు రాకపోవడంతో ఆటోను అంబులెన్స్  మార్చాను’’  అంటున్నాడు భాస్కర్. ప్రతి సాయంత్రం, వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడానికి, వాటిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తీసుకెళ్లడానికి డ్రైవర్ అవసరం ఉండేది. ఎవరూ అందుబాటులో లేకపోవడంతో భాస్కర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘‘నా సంపాదన నుండి ప్రతి వారం కొంత డబ్బును బియ్యం, మాంసం కొనడానికి కేటాయిస్తున్నా. నా భార్య ఆహారాన్ని సిద్ధం చేస్తుంది. మా ఇంటి చుట్టు పక్కల ఉన్న కుక్కలకు, పిల్లులకు ఆహారం అందిస్తా” అని అన్నాడు భాస్కర్.