Sun Is Angry: నివురుగప్పిన నిప్పులా సూర్యుడు.. 2 వారాల్లోనే 36 విస్ఫోటనాలు

సూర్యుడు లేనిది మనం లేం!! సూర్య కిరణాలే పచ్చటి పుడమికి కారణాలు!! అటువంటి సూర్యుడిలో ఏదైనా జరిగితే ?

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 08:45 AM IST

సూర్యుడు లేనిది మనం లేం!! సూర్య కిరణాలే పచ్చటి పుడమికి కారణాలు!! అటువంటి సూర్యుడిలో ఏదైనా జరిగితే ? యావత్ ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ఇటీవల కాలంలో సూర్యుడిలో కాస్త ఆందోళనకర పరిణామాలే జరుగుతున్నాయి. కేవలం రెండు వారాల వ్యవధిలోనే సూర్యుడిపై 35 భారీ విస్ఫోటనాలు , 14 సన్‌స్పాట్‌లు‌, 6 సౌర జ్వాలలు సంభవించాయి. దీన్నిబట్టి సూర్యుడు ఎంతగా అట్టుడుకుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఎన్నడూ లేనిది ఇప్పుడే ఇలా ఎందుకు జరుగుతోంది ? అంటే.. దీనికి సమాధానం “సోలార్ సైకిల్”. ప్రస్తుతం సోలార్ సైకిల్ గరిష్ఠ స్థాయికి సమీపిస్తోంది. 2025 సంవత్సరంలో సౌర చక్రం గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. ఈ టైం సమీపిస్తున్న నేపథ్యంలోనే సూర్యుడిపై 35 భారీ విస్ఫోటనాలు జరిగాయి. గత కొన్ని వారాల్లోనే ..
అంచనాలకు మించిన స్థాయిలో సూర్యుడిపై విస్ఫోటనాలు జరిగాయి. సూర్యుని ఉపరితలంపై సంభవించే భారీ విస్ఫోటనాలను ‘కరోనల్ మాస్ ఎజెక్షన్‌’ అంటారు. ఆ సమయంలో బిలియన్‌ టన్నుల పదార్థం అంతరిక్షంలోకి వెలువడి.. గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

సౌర తుఫానులు..

వీటితో పాటు సూర్యుడిపై సౌర తుఫానులు కూడా సంభవిస్తుంటాయి. సౌర తుఫానులు కొన్ని నేరుగా భూమినీ తాకాయి! భూమిపై ఉన్న జీవరాశులు, సాంకేతికత, కృత్రిమ ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, వ్యోమగాములపైనా సౌర తుఫానులు ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.  కృత్రిమ ఉపగ్రహాలు, కమ్యూనికేషన్‌ సిగ్నళ్లు ప్రభావితం అవుతాయి.

సోలార్ సైకిల్..

సూర్యుడి అయస్కాంత క్షేత్రం ఒక భ్రమణం పూర్తి చేస్తే దాన్ని “సోలార్ సైకిల్” అంటారు. ప్రతి 11 ఏళ్లకు ఒకసారి భానుడి అయస్కాంత క్షేత్రం పూర్తిగా తలకిందులు అవుతుంది. ఈ టైంలో ఉత్తర, దక్షిణ ధ్రువాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. సోలార్ సైకిల్
గరిష్ఠ దశలో ఉన్నప్పుడు ఈ తరహా ప్రక్రియ జరుగుతుంది.

సన్‌స్పాట్‌లు..

సూర్యుడి ఉపరితలంపై చీకటిగా కనిపించే ప్రాంతాలను సన్‌స్పాట్‌లు అంటారు. నక్షత్రం ఉపరితలంపైన ఇతర భాగాల కంటే అక్కడ చల్లగా ఉండటంతో అవి అలా కనిపిస్తాయి.  సన్‌స్పాట్‌ల సమీపంలో అయస్కాంత క్షేత్రాల పునర్వ్యవస్థీకరణతో ఆకస్మికంగా వెలువడే శక్తిని సోలార్‌ ఫ్లేర్స్‌గా పిలుస్తారు.