Titan Submarine: టైటాన్‌ మినీ జలాంతర్గామి కథ విషాదాంతం!

  • Written By:
  • Publish Date - June 23, 2023 / 11:37 AM IST

టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరి వెళ్లి గల్లంతైన టైటాన్‌ మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం పెరగడం వల్ల ‘టైటాన్‌’ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది. రిమోట్‌ కంట్రోల్డ్‌ వెహికల్‌ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. టైటానిక్‌ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యూఎస్‌ కోస్ట్‌ గార్డ్‌ పేర్కొంది.

వెంటనే ఈ విషయాన్ని బాధితుల కుటుంబాలకు తెలిపినట్లు రియర్‌ అడ్మిరల్‌ జాన్‌ మౌగర్‌ తెలిపారు. యూఎస్‌ కోస్ట్‌ గార్డ్‌, రెస్య్కూ సిబ్బంది తరఫున మృతులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టైటానిక్ సమీపంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన అమెరికా కోస్ట్ గార్డ్ కొన్ని శకలాల ఫొటోలు విడుదల చేసింది. అయితే అవి పాత ఫొటోలని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. పోలార్ ప్రిన్స్ అనే నౌకకు అనుసంధానంగా టైటాన్ ని సముద్ర జలాల్లోకి పంపించారు. నిత్యం ఆ నౌకతో టైటాన్ కి కమ్యూనికేషన్ ఉండేది. ఆ కమ్యూనికేషన్ తెగిపోగానే ప్రమాదం జరిగినట్టు నిర్థారించారు.

4రోజులపాటు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రోబోల సాయంతో సముద్రం అడుగున వెదికారు. శకలాలు కనిపించకపోయినా టైటాన్ లోని ఆక్సిజన్ ఇప్పటికే అయిపోయి ఉంటుంది. అంటే టైటాన్ పేలిపోయినా లేక ఎక్కడైనా చిక్కుకుపోయినా అందులోని మనుషులు బతికే అవకాశాలు లేవు. అందుకే వారు మరణించినట్టు ఆ సంస్థ ప్రకటించింది.