Patiala Necklace : రాజకుటుంబానికి దక్కని రూ.230 కోట్ల పటియాలా హారం.. ఆ మోడల్ ఒంటిపై..!

మనవారికి వజ్రాల హారాలు అంటే ఎక్కడ లేని ప్రేమ. అందులోనూ ఇలాంటి హారం కనిపిస్తే.. కళ్లన్నీ దానిపైనే. దీని అందం కూడా చూపుతిప్పుకోనివ్వని విధంగా ఉంది.

  • Written By:
  • Publish Date - May 12, 2022 / 10:00 AM IST

మనవారికి వజ్రాల హారాలు అంటే ఎక్కడ లేని ప్రేమ. అందులోనూ ఇలాంటి హారం కనిపిస్తే.. కళ్లన్నీ దానిపైనే. దీని అందం కూడా చూపుతిప్పుకోనివ్వని విధంగా ఉంది. అప్పట్లో పంజాబ్ లోని పటియాలాను పాలించిన రాజా భూపేందర్ సింగ్ కు ఈ హారం అంటే చాలా ఇష్టం. ప్రపంచంలోనే ఏడో పెద్ద వజ్రాన్ని ఈ నగలో పొదిగారు. భూమిపై ఇప్పటివరకు లభించిన పసుపు పచ్చ వజ్రాలలో ఇదే పెద్దది కూడా. అలాంటి
ఈ నగ.. తరువాతి కాలంలో చోరీకి గురైంది. మళ్లీ ఇప్పుడు ఆ హారాన్ని పోలిన నగ ఓ ఫ్యాషన్ షో లో కనిపించడంతో.. మళ్లీ ఆ ఆభరణం వార్తల్లోకొచ్చింది.

రాజ కుటుంబం ఎన్ని తరాలయినా సరే ఈ వజ్రాన్ని ధరించేలా ఏర్పాటు చేశారు రాజా భూపేందర్ సింగ్. అందుకే దానిని ఈ నగలో పొదిగారు. ఈ ఆభరణం తయారీ బాధ్యతను కార్టియర్ సంస్థకు అప్పగించారు. ఈ నగను ఐదు వరసల హారంగా తయారుచేశారు. మొత్తం 2,930 వజ్రాలను పొదిగారు. అరుదుగా లభించే కెంపులతోనూ అలంకరించారు. వీటన్నింటి మధ్యలో బాగా హైలెట్ అయ్యేలా.. పసుపు పచ్చ వజ్రాన్ని ఉంచారు. ఈ హారం ఖరీదు ఇప్పటి లెక్కల ప్రకారమైతే దాదాపు రూ.230 కోట్ల ఉంటుంది.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 1948 లో ఈ విలువైన ఆభరణం.. రాజావారి ఖజానాలో కనిపించకుండా పోయింది. తరువాత 1982లో సోత్ బే వేలం సంస్థ ద్వారా వేలానికి వచ్చింది. కాకపోతే హారం లేకుండా కేవలం వజ్రాన్నే వేలానికి పెట్టారు. కొద్దికాలం గడిచిన తరువాత లండన్ లో పురాతన వస్తువులను అమ్మే ఓ షాపులో ఈ వజ్రాల హారంలో కొద్దిభాగం కనిపించింది. ఆ తరువాత ఈమధ్యే న్యూయార్క్ లో జరిగిన ఒక ఫ్యాషన్ షో లో కార్టియర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎమ్మా చాంబర్లీన్ ఒంటిపై పటియాలా హారంలోని చోకర్ తరహా భాగం దర్శనమిచ్చింది.

ఈ హారం సుప్రసిద్ధమైనది అయినా సరే.. భద్రతను ఛేదించి మరీ చోరీ చేశారు. తరువాతి కాలంలో బయటపడ్డ ఆ హారాన్ని కార్టియార్ సంస్థవారే కొనుగోలు చేశారు. కాకపోతే అందులో వజ్రాలు లేకపోవడంతో వాటి స్థానంలో రంగురాళ్లు పొదిగారు. లండన్ లో ప్రదర్శనకు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఈ పటియాలా హారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.