Election Freebies: ఉచితం అనే అనుచిత ప‌థ‌కాలు…

ఈ దేశంలో రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం లేదా వ‌చ్చిన అధికారాన్ని కాపాడుకోవడం మిన‌హా మ‌రో ఆలోచ‌న ఉండ‌దు. స‌హ‌జంగా ఏ దేశంలో అయినా రాజ‌కీయ పార్టీలు ఇలాగే ఆలోచిస్తాయి. కాని భార‌త‌దేశంలోని పార్టీలు కొంచెం భిన్నం.

  • Written By:
  • Updated On - August 4, 2022 / 11:32 AM IST

ఈ దేశంలో రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం లేదా వ‌చ్చిన అధికారాన్ని కాపాడుకోవడం మిన‌హా మ‌రో ఆలోచ‌న ఉండ‌దు. స‌హ‌జంగా ఏ దేశంలో అయినా రాజ‌కీయ పార్టీలు ఇలాగే ఆలోచిస్తాయి. కాని భార‌త‌దేశంలోని పార్టీలు కొంచెం భిన్నం. ఇక్క‌డ పార్టీలంటే నాయ‌కులే. ముఖ్య నేత‌ల ప్ర‌యోజ‌నాలు, వారు అధికారం పొంద‌డ‌మే పార్టీల ల‌క్ష్యాలుగా ఉంటాయి. అందుకే పార్టీ ఏదైనా న‌క్ష‌త్రాల‌ను కోసుకొచ్చి ఇస్తామ‌ని, చంద్రుడి తెచ్చి చేతికిస్తామ‌నే స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల హామీలిస్తుంటాయి. అంతేకాకుండా ప్ర‌జ‌ల‌ను మొత్తంగా అవినీతిప‌రులుగా మార్చేశాయి దేశంలోని రాజ‌కీయ పార్టీలు. ఓట్లు వేయ‌డానికి నోట్లు ఇస్తున్నాయి. మ‌ద్యం పోస్తున్నాయి. అంతిమంగా అధికార‌మే ల‌క్ష్యంగా వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాయి. గెలిచాక వేల కోట్లు సంపాదించుకుంటున్నారు మ‌న నాయ‌కులు. నాయ‌కుల్ని అధికారంలోకి తీసుకురావ‌డానికి ఖ‌జానాకు తూట్లు పొడిచేలా, దేశాన్ని, రాష్ట్రాల‌ను అప్పుల ఊబిలో దించేలా ఇస్తున్న ఉచిత హామీల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి సుప్రీం కోర్టు చొర‌వ తీసుకోవ‌డం సంతోష‌క‌ర‌మే. కాని దేశంలోని రాజ‌కీయ పార్టీలు ఈ విష‌యంలో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం మాట వింటాయా. 8 ఏళ్ళ క్రిత‌మే ఇటువంటి వాటిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం సుప్రీం కోర్టు సూచ‌న‌ల ప్రకారం ఎన్నిక‌ల సంఘం రాజ‌కీయ పార్టీల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసినా ఉప‌యోగం లేకుండా పోయింద‌ని కూడా కామెంట్ చేసింది.

ప్ర‌తి రాష్ట్రంలోనూ రాజ‌కీయ పార్టీల హామీలు వాటి సంవ‌త్స‌ర బ‌డ్జెట్ ను మించిపోతున్నాయి. మ‌న పార్టీలు ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు, వారిని ఉన్న‌త పౌరులుగా తీర్చిదిద్ద‌డానికి, విద్య‌, వైద్యం ఉత్త‌మ స్థాయిలో అందించ‌డానికి పెద్ద‌గా ప్ర‌య‌త్నించ‌డంలేదు. కేవ‌లం కొన్ని ఉచిత ప‌థ‌కాల ద్వారా అధికారంలోకి రావ‌చ్చ‌ని, ప‌వ‌ర్ చేతిలోకి వ‌చ్చాక వాటిని అమ‌లు చేయ‌క‌పోయినా ఎవ‌రూ ఏమీ ప‌ట్టించుకోర‌నే ధైర్యం వ‌చ్చింది. కొన్నిసార్లు వారు అనుకున్న‌ది జ‌రుగుతున్న‌ది కూడా. 2014లో బీజేపీ ఎన్నిక‌ల హామీల్లో స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న మ‌న కుబేరుల న‌ల్ల ధ‌నాన్ని వెన‌క్కు తీసుకురావ‌డం కూడా ఉంది. 8 ఏళ్ళ‌వుతున్నా బ్లాక్ మ‌నీ వెన‌క్కి తెచ్చింది లేదు. మోడీ ఆనాడు హామీ ఇచ్చిన‌ట్లుగా ప్ర‌తి ఒక్క‌రి బ్యాంక్ అక్కౌంట్లలో 15 ల‌క్ష‌ల రూపాయ‌లు వేసిందీ లేదు. ఆ హామీ అలాగే ఉండి పోయింది. అయితే ఇది ఖ‌జానా మీద భారం మోపేది కాదు గ‌నుక పిట్ట‌ల దొర హామీగా మిగిలిపోయినా పెద్ద‌గా న‌ష్టంలేదు. కాని తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్, పంజాబ్ త‌దిత‌ర ఐదు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డి పార్టీలు ఇస్తున్న హామీలు బ‌డ్జెట్ ను మించిపోతున్నాయ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో 2014 ఎన్నిక‌ల నాటి నుంచి ఇక్క‌డి పార్టీలు ఇస్తున్న హామీలు వాటిని అమ‌లు చేస్తున్న తీరును చూస్తూనే ఉన్నాం. ఏపీలో 2014లో అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం రైతుల‌కు ఇచ్చిన రుణ‌మాఫీ హామీ అమ‌లు చేయ‌డానికి అనేక పిల్లిమొగ్గ‌లు వేసింది. చివ‌రికి త‌న హామీని పూర్తిగా అమ‌లు చేయ‌కుండానే టీడీపీ ప్ర‌భుత్వం అధికారం కోల్పోయింది. 2019 ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు మ‌హిళ‌కు ప‌సుపు కుంకుమ అంటూ డ్వాక్రా సంఘాల‌కు ప‌ది వేల చొప్పున పంచిపెట్టినా ఫ‌లితం లేకుండా పోయింది. ఇక న‌వ‌ర‌త్నాల పేరుతో స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌కు ల‌క్ష‌ల కోట్ల విలువైన హామీలిచ్చి వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు వాటిని అమ‌లు చేయ‌డానికి నానా తంటాలు ప‌డుతున్నారు. అందుకోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేశారు. జీతాలు ఇవ్వ‌డానికి, హామీలు అమ‌లుచేయ‌డానికి ప్ర‌తి నెలా అప్పులు చేస్తూనే ఉన్నారు. అప్పుల కోసం ప్ర‌భుత్వ ఆస్తుల‌ను తాక‌ట్టు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం 30 నెల‌ల కాలంలో పేద‌ల సంక్షేమానికి అక్ష‌రాల ల‌క్షా 16 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఇక తెలంగాణ ప్ర‌భుత్వం కూడా త‌క్కువేమీ తినలేదు. కొన్ని నెల‌ల క్రితం వినూత్నంగా ఆలోచించి ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది. ధ‌నిక‌, పేద తార‌త‌మ్యం లేకుండా రాష్ట్రంలోని 17 ల‌క్షల ద‌ళిత కుటుంబాల‌కు ఒకేసారి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున సాయం చేస్తున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. హుజూరాబాద్ అసెంబ్లీ సీటుకు జ‌రిగిన ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఆయ‌న ఈ ప‌థ‌కం ప్ర‌క‌టించారు. వెనువెంట‌నే ఇత‌ర వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో ద‌ళితుల‌తో పాటు గిరిజ‌నులు, బీసీలకు కూడా ఈ త‌ర‌హా ప‌థ‌కాన్ని ద‌శ‌ల‌వారీగా అమ‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇలా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం కోసం ఎవ‌రికి తోచిన విధంగా వారు అల‌వికాని హామీలిస్తూ, ఖ‌జానాకు తూట్లు పొడ‌వ‌కుండా ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసే విధంగా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేయ‌డం దేశ ఆర్థిక ఆరోగ్యానికి చాలా మంచిది. కాని పిల్లి మెడ‌లో గంట క‌ట్టేది ఎవ‌రు? చ‌ట్టాలు చేసేది, అమ‌లు చేసేది ఈ నాయ‌కులే క‌దా?