Afghan Women Cricketers : ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న అన్ని టీమ్స్ వేరు.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ వేరు!! ఎందుకంటే అన్నింటి తరఫున పురుషుల టీమ్, మహిళల టీమ్ ఉన్నాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్ తరఫున మహిళల టీమ్ లేదు. ఇంతకీ ఎందుకు ? అంటే.. తాలిబన్ల నిరంకుశ పాలన వల్ల!! 2021 ఆగస్ట్ 15న ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న క్షణంలోనే ఎంతోమంది ఆఫ్ఘన్ యువతులు క్రికెట్ ఆడాలనే స్వప్నాన్ని చంపుకున్నారు. తమ జీవితకాల లక్ష్యం ఇక నెరవేరదని నిరాశకు లోనయ్యారు. ఎలాగోలా వారంతా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను దాటి వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. ఈ చేదు అనుభవాలను ఫిరోజా ఆఫ్ఘన్ ప్రముఖ మీడియా సంస్థకు వివరించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
Also Read :Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
18 తాలిబన్ చెక్ పాయింట్లు దాటుకొని..
‘‘2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో పాగా వేసిన టైంలో నా వయసు 17 ఏళ్లు. తాలిబన్లకు భయపడి నా స్పోర్ట్స్ సర్టిఫికెట్లను(Afghan Women Cricketers) తగలబెట్టాను. ఎందుకంటే వాటిని చూస్తే తాలిబన్లు చంపేస్తారు. నా క్రికెట్ కోచ్ సహకారంతో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లను తయారు చేయించాను. వాటి సహకారంతో ఆఫ్ఘనిస్తాన్‌లోని 18 తాలిబన్ చెక్ పాయింట్లను దాటాం. మూడు నెలల ప్రయాణం తర్వాత ఎట్టకేలకు పాకిస్తాన్‌లోకి మా కుటుంబం అడుగుపెట్టింది. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు 9 నెలల టైం పట్టింది’’ అని ఫిరోజా ఆఫ్ఘన్ వివరించారు.
Also Read :BC-Welfare : నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు : సీఎం చంద్రబాబు
ప్రవాసంలో ఉన్న మహిళా ప్లేయర్లతో టీమ్..
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడానికి దాదాపు తొమ్మిది నెలల ముందు మహిళల జాతీయ క్రికెట్ టీమ్ కోసం 25 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక.. వారంతా భయపడి విదేశాలకు వెళ్లిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెట్ ప్లేయర్లలో చాలామంది ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌లకు వలస వెళ్లారు. అందుకే ఫిరోజా ఆఫ్ఘన్ కూడా ఆస్ట్రేలియాకు వెళ్లారు. చెరొక దేశంలో చెల్లాచెదురుగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లు తమ దేశం తరఫున ఆడాలని కోరుకుంటున్నారు. ప్రవాసంలో ఉన్న మహిళా క్రికెటర్లతో కలిపి ఆఫ్ఘనిస్తాన్ కోసం ఒక క్రికెట్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని వారు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని డిమాండ్ చేస్తున్నారు. అయితే అందుకు రూల్స్ అనుమతించవని ఐసీసీ చెబుతోంది.
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్‌ను కలిసిన ఫిరోజా..
2023 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ టీమ్ బస చేసిన హోటల్‌కు ఫిరోజా ఆఫ్ఘన్ వెళ్లారు. ‘‘మహిళల క్రికెట్ టీమ్ గురించి మీరెందుకు మాట్లాడరు. మా గురించి పట్టదా మీకు’’ అని ఆఫ్ఘన్ పురుషుల క్రికెట్ టీమ్‌లోని ఒక స్టార్ ప్లేయర్‌ను ఫిరోజా ఆఫ్ఘన్ ప్రశ్నించారు. అదంతా నిశ్శబ్దంగా విన్న ఆ ప్లేయర్.. ‘‘సారీ’’ అనే సమాధానం ఇచ్చి మూగబోయారు. క్రికెట్ ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రీడ కాకున్నా.. అది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఇష్టమైన క్రీడగా మారింది. కానీ అక్కడి మహిళలకు మాత్రం దాన్ని ఆడే అవకాశం దక్కకపోవడం శోచనీయం.