తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా (Telangana PCC Chief) రేవంత్ రెడ్డి స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఖరారయ్యారు. గత ఎనిమిది నెలలుగా పీసీసీ పదవి ఎవరికీ దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పదవి కోసం సీనియర్ నేతలు అధిష్టానం వద్ద గట్టిగానే ట్రై చేసారు. VH మొదలుకుని మధుయాష్కీ గౌడ్ వరకు ఉన్నారు. దీనికితోడు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి పార్టీ బడా లీడర్లు ఉన్నారు. వారి వర్గం బలంగా ఉంది. నల్లగొండలో ఉత్తమ్ కుమార్, జానా రెడ్డి, కోమటి రెడ్డి కుటుంబం, ఖమ్మంలో పొంగులేటి, భట్టి, తుమ్మల ఇలా బడా బడా నాయకులు అధిష్టానం వద్ద ఈ పదవి ఫై పైరవీలు , పలువురిపేర్లు సూచించారు.
మొదటి నుండి మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఉన్నాడు
కానీ అధిష్టానం (AICC) మాత్రం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కే మొగ్గు చూపించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన నేతకు ఏఐసీసీ అధిష్టానం కీలక పదవి అప్పగించడం ఫై బీసీ సంఘాలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కీలక పదవైనా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు దక్కడానికి గల కారణాలు ఏంటనే అంశంపై అంతటా చర్చ సాగుతుంది. మహేష్ ప్రధానంగా మొదటి నుండి పార్టీకి విధేయతగా ఉండడం.. విద్యార్థి రాజకీయాల నుంచే కాంగ్రెస్ తో ఉండడం వల్లే ఈరోజు ఈ పదవికి ఆయనకు దక్కినట్లు చెప్పుకుంటున్నారు.
నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా మహేష్ గౌడ్ పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితుడయ్యాడు. 2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా , 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుడయ్యాడు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నాడు.
రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యనేతలందితో సన్నిహితం
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. అయితే.. తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నరనే చర్చ ప్రారంభమైన నాటి నుంచి మహశ్ కుమార్ గౌడ్ పేరు చుట్టే ప్రధానంగా చర్చ సాగింది. రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యనేతలందితో సన్నిహితంగా ఉండడం ఆయనకు కలిసివచ్చింది.
తన నియామకంపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నాపై అత్యంత నమ్మకంతో నాకు కీలకమైన టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంట్ ప్రతి పక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, డీసీసీ అధ్యక్షులకు, పార్టీ కోసం అనునిత్యం పాటు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
పార్టీ కోసం..రాష్ట్రం కోసం కృషి చేస్తా
పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తాను. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. ఇంతకాలం నాకు అన్ని రకాలుగా సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. నాకు పదవి రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’ అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు.
Read Also : Congress : కేజ్రీవాల్‌కు షాక్..కాంగ్రెస్ లో చేరిన ఆప్ ఎమ్మెల్యే