Malavath Purna: పూర్ణ ది గ్రేట్.. ఏడు ఎత్తైన శిఖరాల అధిరోహణ!

పట్టుదల, అంకితభావం ఉండాలేకానీ.. ప్రపంచంలో సాధ్యంకానిదంటూ ఏమీ ఉండదు.

  • Written By:
  • Updated On - June 9, 2022 / 01:14 PM IST

పట్టుదల, అంకితభావం ఉండాలేకానీ.. ప్రపంచంలో సాధ్యంకానిదంటూ ఏమీ ఉండదు. సాధారణంగా ఆడపిల్ల చిన్న పర్వతం ఎక్కాలంటే భయపడే రోజులివి.. అలాంటి ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రపంచంలో ఎత్తైన ఏడు శిఖరాలను అధిరోహించి మరోసారి వార్తల్లోకి ఎక్కింది మాలావత్ పూర్ణ. ప్రపంచంలోని 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించి దేశం గర్వించేలా చేసింది. ఈ నెల 5వ తేదీన 6,190 మీటర్ల ఎత్తుతో ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తైన దెనాలి శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఆమె వరల్డ్ 7 సమ్మిట్ ఛాలెంజ్‌ను పూర్తి చేసింది. ‘భారతదేశంలో అతి పిన్న వయస్కురాలు’గా రికార్డు సృష్టించింది.

మే 18న ఇండియా నుంచి బయలుదేరిన పూర్ణ మే 19న అలస్కాలోని ఎంకరేజ్‌కి చేరుకుంది.ఈ పర్వతారోహణలో పూర్ణతో పాటు మన దేశానికి చెందిన మరో నలుగురు సభ్యులు ఉన్నారు. మే 23న బేస్ క్యాంప్‌కు చేరుకున్నవారు క్లైంబింగ్ ను ప్రారంభించి, ఈ నెల 5న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కోచ్ శేఖర్ బాబు శాటిలైట్ ఫోన్ ద్వారా వెల్లడించారు. ఈ యాత్రకు స్పాన్సర్ అయిన ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వైవీ గోపాలకృష్ణ మూర్తికి, తనకు సహకరించిన తన గురువు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ (వీఆర్‌ఎస్) బీఎస్‌బీ ఫౌండేషన్ చైర్మన్ భూక్యా శోభన్ బాబుకు పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. 7 సమ్మిట్ ఛాలెంజ్‌ని పూర్తి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

ఈ కార్యక్రమంలో అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అజిత్ బజాజ్, ఆయన కూతురు దియా బజాజ్, విశాఖపట్నంకు చెందిన అన్మిష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పోస్ట్-గ్రాడ్యుయేషన్ చదువుతున్న పూర్ణ, ‘2014లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్బ్రస్, దక్షిణ అమెరికాలోని అకాన్‌కాగువా, ఓషియానియాలోని కార్టెంజ్ పిరమిడ్, అంటార్కిటికాలోని విన్సన్, ఇటీవల ఉత్తర అమెరికాలో డెనాలి. ఈ 7వ సమ్మిట్ అధిరోహించిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి యువతిగా పూర్ణ రికార్డులకెక్కింది!