Site icon HashtagU Telugu

Kakatiya king @ Warangal: ఓరుగల్లు గడ్డపైకి కాకతీయ వారసుడు!

Kakatiya

Kakatiya

ఇవాళ ప్రారంభం కానున్న కాకతీయ ఫెస్ట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న కాకతీయ రాజుల వారసుడికి తెలంగాణ మంత్రుల నుంచి ఘనస్వాగతం లభించింది. కాకతీయ వంశ వైభవాన్ని చాటిచెప్పేందుకు ప్రభుత్వం వారం రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఈరోజు కాకతీయుల 22వ తరం వారసుడు కమల్ చంద్ర భంజ్ డియో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా వరంగల్‌లోని భద్రకాళి ఆలయానికి చేరుకున్న ఆయనకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌లు ఘన స్వాగతం పలికారు. కాకతీయ రాజులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని సువిశాలమైన కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చరిత్ర వరంగల్ జిల్లాకు ఉన్న సంగతి తెలిసిందే.

రాణి రుద్రమదేవి, ప్రతాపరుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆ వైభవానికి ప్రతీకగా వెయ్యి స్తంభాల గుడి కిల్లా వరంగల్ కోట, వరంగల్ నగరంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న కాకతీయ కళాక్షేత్రం నేటికీ గతకాలపు సాక్ష్యంగా నిలిచి నేటి తరాలకు కాకతీయుల వైభవాన్ని గుర్తు చేస్తున్నాయి. కాకతీయ వైభవాన్ని నేటి తరాలకు తెలియజేయాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరంలో నేటి నుంచి వేడుకలను నిర్వహిస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌కు చెందిన కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ డియోను ప్రత్యేక అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కాకతీయ సామ్రాజ్యం అంతమై దాదాపు 800 ఏళ్లు గడుస్తున్నా ఓ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఓరుగల్లు గడ్డపై కాకతీయ సామ్రాజ్య వారసులు అడుగులు వేస్తున్నారు.

Exit mobile version