One Student – One ID : దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతీ విద్యార్థికి ఒక్కో ప్రత్యేక గుర్తింపు నంబర్ ను కేటాయించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నంబరును ఆధార్ నంబర్ తో పాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్’ (ఏబీసీ) అనే ఎడ్యులాకర్‌కు లింక్ చేయనున్నారు. ఈ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తేనున్నారు.దీంతో మన దేశంలోని విద్యార్థులందరి సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఈ విధానాన్ని కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ‘ఛైల్డ్ ఇన్ఫో’ పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. త్వరలో కేంద్రం విధానం అమల్లోకి వస్తే.. ఇకపై మన తెలుగు రాష్ట్రాల్లో ఛైల్డ్ ఇన్ఫో నంబర్ ను కేటాయించాల్సిన అవసరం ఉండదు. కేంద్ర సర్కారు కేటాయించే నంబర్ ఒక్కటే సరిపోతుంది. దేశవ్యాప్తంగా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండియర్ వరకు 26 కోట్ల మంది విద్యార్థులున్నందున 17 అంకెలున్న సంఖ్యను ఐడీ నంబర్ గా కేటాయించే ఛాన్స్ ఉంది.
We’re now on WhatsApp. Click to Join
ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం(యూడైస్) ద్వారా అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా విద్యార్థులను ఐడీ నంబర్లను కేంద్రం కేటాయించనుంది. ఇది అందుబాటులోకి వచ్చాక.. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినా, చదువు మానేసినా వారి వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు. నూతన జాతీయ విద్యా విధానంలో నిర్దేశించిన ఒక నిబంధన ప్రకారం వన్ స్టూడెంట్ వన్ ఐడీ నంబర్ ను అమల్లోకి తెస్తున్నారు. దీన్ని అమలు చేసే బాధ్యతను కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు అప్పగించనున్నారు. ఈ ఫోరమ్ కు ఛైర్మన్‌గా ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఇది అమల్లోకి వచ్చాక.. విద్యార్థులకు అలాట్ చేసే ఐడీ నంబర్ ను ఎంటర్ చేయగానే.. విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్‌షిప్స్ వివరాలన్నీ ప్రత్యక్షం అవుతాయి. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణపత్రాలను డిజిటల్ గా పరిశీలించి సీటు ఇచ్చే ఛాన్స్ (One Student – One ID) కలుగుతుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుంది.