Modi Success:మోడీ స‌భ సూప‌ర్ హిట్ ర‌హ‌స్య‌మిదే.!

`భార‌త భూభాగంలోకి చైనా సైనికులు దూసుకొస్తుంటే నీ 36 అంగుళాల ఛాతి ఏమైంది? అంటూ మోడీని ప్ర‌శ్నించిన కేసీఆర్ ఇటీవ‌ల విమ‌ర్శ‌లను ఎదుర్కొన్నారు. కంటోన్మెంట్ ఏరియాకు విద్యుత్‌, మంచినీళ్ల స‌ర‌ఫ‌రా క‌ట్ చేస్తామ‌ని కేటీఆర్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిచారు.

  • Written By:
  • Publish Date - July 4, 2022 / 01:45 PM IST

`భార‌త భూభాగంలోకి చైనా సైనికులు దూసుకొస్తుంటే నీ 36 అంగుళాల ఛాతి ఏమైంది? అంటూ మోడీని ప్ర‌శ్నించిన కేసీఆర్ ఇటీవ‌ల విమ‌ర్శ‌లను ఎదుర్కొన్నారు. కంటోన్మెంట్ ఏరియాకు విద్యుత్‌, మంచినీళ్ల స‌ర‌ఫ‌రా క‌ట్ చేస్తామ‌ని కేటీఆర్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిచారు. ` సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆ మ‌ధ్య‌ చేసిన వాఖ్య‌లు సికింద్రాబాద్ మోడీ బ‌హిరంగ స‌భ‌ను హిట్ చేసిందా? అనే సందేహం క‌లుగుతోంది. బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన వాళ్ల‌లో మెజార్టీ జ‌నం నార్త్‌కు చెందిన వాళ్ల‌ని ప్రాథ‌మికంగా నిఘా వ‌ర్గాలు గుర్తించార‌ని తెలుస్తోంది.

సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌడ్స్ లో బీజేపీ బ‌హిరంగ స‌భ సూప‌ర్ హిట్ కావ‌డంపై టీఆర్ఎస్ అధ్య‌య‌నం చేస్తోంది. రాష్ట్ర నిఘా వ‌ర్గాల ద్వారా స‌మాచారం సేక‌రించే ప‌నిలో ప‌డింది. ఇప్ప‌టికే వాళ్ల వ‌ద్ద ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఎక్కువ మంది ఉత్త‌ర‌భార‌త‌దేశానికి సెటిల‌ర్లు హాజ‌ర‌య్యార‌ని వినికిడి. హైద‌రాబాద్ కేంద్రంగా చేసుకుని వివిధ వ్యాపారాలు చేసుకుంటోన్న‌ చిన్నాచిత‌క నార్త్ సెటిల‌ర్లు ఎక్కువ‌గా మోడీ స‌భ‌లో కనిపించార‌ట‌. అంతేకాదు, కంటోన్మెంట్ ఏరియాలో ఉంటోన్న‌ భార‌త సైన్యానికి చెందిన కుటుంబీకులు, రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగులు సికింద్రాబాద్ స‌భ‌కు త‌ర‌లి వ‌చ్చార‌ని తెలుస్తోంది. వీళ్ల‌తో పాటు మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు తెలంగాణ జిల్లాల నుంచి ఉత్సాహంగా బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ ముగింపు స‌భ‌కు తండోప‌దండాలుగా వ‌చ్చార‌ని నిఘా వ‌ర్గాల అంచ‌నా. అందుకే అనూహ్యంగా మోడీ స‌భ సూప‌ర్ హిట్ అయిందని భావిస్తున్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో్నూ బీజేపీకి అండ‌గా నార్త్ నుంచి వ‌చ్చి హైద‌రాబాద్ లో సెటిల్ అయిన వాళ్ల నిలిచింది. అందుకే, 44 మంది కార్పొరేట‌ర్ల‌ను గెలుచుకుంది. ఏ మాత్రం టీఆర్ఎస్ పార్టీకి త‌గ్గ‌కుండా పోటీ ఇచ్చింది. కేవ‌లం ఆంధ్రా ప్రాంత సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో మాత్ర‌మే టీఆర్ఎస్ కార్పొరేట‌ర్లు ఎక్కువ‌గా గెలిచారు. మిగిలిన ప్రాంతాల్లో ప్ర‌త్యేకించి నార్త్ సెటిల‌ర్లు ఉన్న చోట బీజేపీ జెండా ఎగిరింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ కేవ‌లం ఇద్ద‌రు కార్పొరేట‌ర్లకు ప‌రిమితం అయింది. అంటే, బీజేపీ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరిగిందని అంచ‌నా వేసుకోవ‌చ్చు. అదే ఒర‌వ‌డి దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లోనూ కనిపించింది. నార్త్ సెటిల‌ర్లు సాలిడ్ గా బీజేపీ వైపుకు మ‌ళ్లార‌ని నిఘా వ‌ర్గాలు వేస్తోన్న అంచ‌నా. అందుకే, ఇటీవల ఆంధ్రా సెటిల‌ర్ల‌కు కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు.

భార‌త సైన్యం ధైర్యాన్ని, గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తూ భార‌త్‌, చైనా స‌రిహ‌ద్దుల గురించి కేసీఆర్ మాట్లాడార‌ని ఆ మ‌ధ్య బీజేపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కూడా డిమాండ్ చేసింది. ఇక కంటోన్మెంట్ ఏరియాకు విద్యుత్‌, మంచినీళ్లు క‌ట్ చేస్తామంటూ కేంద్రంపై నిర‌స‌న‌ను మంత్రి కేటీఆర్ వ్య‌క్త‌ప‌రిచారు. దీంతో కంటోన్మెంట్ లోని భార‌త ఆర్మీ కుటుంబాలు బీజేపీ వైపు పూర్తిగా మ‌ళ్లాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చాప‌కింద నీరులా నార్త్ సెటిల‌ర్లు, ఆర్మీ సంబంధ కుటుంబీకులు ఎక్కువ‌గా మోడీ బ‌హిరంగ స‌భ‌కు త‌ర‌లిరావ‌డం భ‌విష్య‌త్ లో టీఆర్ఎస్ పార్టీకి గడ్డు రోజులు ఉన్న‌ట్టేన‌ని పేరు తెలప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఒక నార్త్ ఇండియా సామాజిక విశ్లేష‌కుడు అంటున్నారు. మొత్తం మీద ఈసారి కేసీఆర్ కు నార్త్ సెటిల‌ర్ల రూపంలో పెద్ద రాజ‌కీయ ప్ర‌మాదం ఉంద‌ని మోడీ బ‌హిరంగ స‌భ సూప‌ర్ హిట్ ను కొల‌మానంగా చూపిస్తోన్న వాళ్లు లేక‌పోలేదు.