KCR Telangana Struggle: 2001లో జలదృశ్యంలో కేసీఆర్ చూపించిన ఆ మూడు లేఖల్లో ఏముంది?

తెలంగాణ చరిత్ర తిరగేస్తే.. టీఆర్ఎస్ పోరాటానికి ప్రత్యేక పేజీలు ఉంటాయి.

  • Written By:
  • Publish Date - April 27, 2022 / 09:00 AM IST

తెలంగాణ చరిత్ర తిరగేస్తే.. టీఆర్ఎస్ పోరాటానికి ప్రత్యేక పేజీలు ఉంటాయి. కేసీఆర్ గురించి ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. తెలంగాణ అంతటా పోరాటం నడిచేది. అలాంటివారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ దే. ప్రజల్లో పోరాట పటిమ సడలిపోకుండా తన నాయకత్వ పటిమతో వారిలో స్పూర్తి నింపిన లీడర్ గా కేసీఆర్ నిలిచిపోతారు. అందరినీ ముందుండి నడిపించిన నేతగా, తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ కు ఆ గౌరవం ప్రజల్లో ఇప్పటికీ ఉంది. అదే టీఆర్ఎస్ కు రక్షగా నిలిచింది. ఇలాంటి దృఢ సంకల్పానికి 2001లో గట్టి పునాది పడింది.

హైదరాబాద్ లోని జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27న ఉదయాన్నే ఆవిష్కృతమైన దృశ్యాన్ని చూసినవారు పెదవి విరిచేశారు. అక్కడ పెద్దగా జనం లేకపోవడంతో పార్టీ మనుగడ కష్టమనుకున్నారు. ఎందుకంటే తెలంగాణ అంటే పోరాటం తప్పదు అన్న భావన వారిది. చరిత్ర అదే చెబుతోంది. కానీ అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కేసీఆర్ మూడు రాజీనామా లేఖలతో ఆ ప్రాంగణానికి రావడం సంచలనం సృష్టించింది. ఒకటి తన డిప్యూటీ స్పీకర్ పదవికి, రెండోది తన శాసనసభ్యత్వానికి, మూడోది తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖలు అవి. అంటే మనసా వాచా కర్మణా..పూర్తిగా తెలంగాణ పోరాటానికే అంకితం కావాలని సంకల్పించి ఆనాడు అలా ముందడుగు వేశారు కేసీఆర్.

ఒక కొత్త పార్టీ ప్రకటన అంటే అక్కడి సందడి తారస్థాయిలో ఉంటుంది. సామాజికవర్గాల పరంగా, ప్రాంతాల పరంగా ప్రజలు పోటెత్తుతారు. కానీ ఆనాడు వీటన్నింటికీ అతీతంగా తెలంగాణా సాధనే లక్ష్యంగా కొద్దిమంది మాత్రమే అక్కడికి వచ్చారు. కాకపోతే పార్టీ ప్రకటనకు ముందు ఎలాంటి ఆర్భాటాల్లేవు. వాతావరణం సాదాసీదాగా ఉంది. అందుకే పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెద్దగా లేదు. కానీ ఆ నిశ్శబ్ద సవ్వడి తెలంగాణ చరితను మార్చుతుందని.. బంగారు భవితను రాస్తుందని ఆనాడు చాలామంది ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అది నిజమైంది. టీఆర్ఎస్ ఆ కలను సాకారం చేయడంలో అలుపెరుగని పోరాటం చేసింది.

తొలుత రాజీనామా లేఖలు చూపించిన తరువాత కేసీఆర్ స్పీచ్ మొదలైంది. అది ప్రజల్లో ఆలోచనను రగిలించింది. స్ఫూర్తిని నింపింది. దగాపడ్డ తెలంగాణను పచ్చటి తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్ మాటలు వారికి నచ్చాయి. అందుకే ఆయన వెన్నంటి నిలిచారు. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆయన ప్రకటించారు. అప్పటి నుంచి గులాబీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. ఆరోజు ఎగిసిన జెండా.. ఇప్పటివరకు అలా వినువీధిలో ప్రకాశిస్తూనే ఉంది. తెలంగాణ చరితను చాటుతూ.. భవితకు మార్గదర్శిగా నిలుస్తూ.. మరపురాని విజయాలను అందిస్తూ గర్వంగా ఎగురుతూనే ఉంది. అలా 21 ఏళ్ల ఘనమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.