Mahila Samman Saving Certificate Scheme : మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ (MSSC) ఏప్రిల్ 1 నుంచి ఆరంభమవుతోంది. షార్ట్ టర్మ్ క్యాష్ డిపాజిట్ చేస్తే.. ఎక్కువ వడ్డీ ఇవ్వడం దీని ప్రత్యేకత. ఇందులో మహిళలు లేదా బాలికల పేరుతో రూ.2 లక్షల వరకు గరిష్ఠంగా డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ గరిష్ఠ కాల పరిమితి రెండేళ్లు.. 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ సందర్భంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని (Mahila Samman Saving Certificate Scheme) ప్రకటించారు. ఈ స్కీంలో చేరేందుకు అర్హతలు ఏంటి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరు అర్హులు?
కేవలం మహిళలు లేదా బాలికల పేరుతోనే డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ప్రస్తుతం చాలా బ్యాంకులు, పోస్టాఫీస్ ఫిక్సడ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీయే ఇందులో పొందొచ్చు. ఒక్కో ఖాతాలో గరిష్ఠంగా రూ.2 లక్షలే జమచేయాలి. ఇది వన్‌టైమ్ స్కీమ్. అంటే 2023-2025 మధ్యే రెండేళ్లు ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. అవసరమైతే పాక్షిక మొత్తం ఖాతాలోంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సెక్షన్ 80సీ కింద మినహాయింపులు ఉంటాయి.
ఎక్కడ?
జాతీయ బ్యాంకులు, పోస్టా ఫీసులలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాలను తెరవొచ్చు. దరఖాస్తు పత్రాల్లో వ్యక్తిగత, నామినీ, ఆర్థిక వివరాలు ఇవ్వాలి. సంబంధిత గుర్తింపు పత్రాలను సమర్పించాలి. డిపాజిట్ తర్వాత మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పెట్టుబడి పత్రాలను ఇస్తారు. గడువు తీరాక వెళ్తే వడ్డీతో సహా డబ్బులు ఇచ్చేస్తారు.
ప్రయోజనం ఇదీ..
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో గరిష్ఠ పెట్టుబడి రూ.2 లక్షలను పెడితే ఎంతొస్తుందో చూద్దాం! మొదటి సంవత్సరం 7.5 శాతం చొప్పున రూ.15,000 వడ్డీ జమ అవుతుంది. రెండో ఏడాది అసలు, తొలి ఏడాది వడ్డీ రెండింటికీ కలిపి రూ.16,125 వడ్డీ చెల్లిస్తారు. అంటే రెండేళ్ల తర్వాత మీ అసలు రూ.2లక్షలు, వడ్డీ రూ.31,125 మొత్తంగా రూ.2,31,125 అందుకుంటారు.
Also Read: Loneliness & Silence: ఒంటరితనమే లోకం.. నిశ్శబ్దమే బంధువుగా వృద్ధుల టౌన్