Site icon HashtagU Telugu

One Nation- One Election: వ‌న్ నేష‌న్‌- వ‌న్ ఎల‌క్ష‌న్‌ అంటే ఏమిటి? ప్రయోజనాలు, అప్ర‌యోజ‌నాలు ఇవేనా..?

One Nation One Election

One Nation One Election

One Nation- One Election: వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ (One Nation- One Election)కు మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సమర్పించారు. అక్కడ చర్చ తర్వాత ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లును వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. మార్చి నెలలోనే కమిటీ తన నివేదికను సమర్పించింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నివేదిక సూచించింది.

రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా 100 రోజుల్లో పూర్తి చేయాలి. అంటే దేశంలోని అన్ని ఎన్నికలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. ఇది డబ్బు, సమయం రెండింటినీ ఆదా చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని నివేదిక తెలిపింది.

అస‌లు ఈ వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం? దాని ప్రయోజనాలు, అప్రయోజనాలు ఏమిటి? ఏ దేశాల్లో ఇది వర్తిస్తుంది? భారతదేశంలో దీన్ని అమలు చేయడంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం.

వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటే ఏమిటి?

వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే పార్లమెంట్ దిగువ సభకు అంటే లోక్ సభకు ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. భారతదేశ లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలుగా పరిగణించబడుతున్నాయి. ఇందులో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దేశంలో ప్రతి 6 నెలలకోసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే దేశం, ఒకే ఎన్నికలు నిర్వహించడంపై మోదీ ప్ర‌భుత్వం దృష్టి సారించింది.

Also Read: New XEC Covid Variant: భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న క‌రోనా కొత్త వేరియంట్‌.. 27 దేశాల్లో కేసులు!

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏకకాలంలో ఎన్నికలు

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి సంవత్సరాల్లో లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1952, 1957, 1962, 1967 సంవత్సరాల్లో ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. దీని తరువాత కొన్ని రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరించబడ్డాయి. కొన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటితోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు ఎన్నిక‌ల అనంత‌రం రద్దు చేశారు. వీటి కారణంగా ఎన్నికల వ్యవస్థ దిగజారింది.

ఒకే దేశం-ఒకే ఎన్నికల ప్రయోజనాలు, అప్రయోజనాలు

ఒకే దేశం, ఒకే ఎన్నికల వల్ల ఎన్నికల ఖర్చు తగ్గడమే అతిపెద్ద ప్రయోజనం. విడివిడిగా ఎన్నికల నిర్వహణకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ సొమ్ము ప్రజల నుంచి వచ్చిన పన్ను సొమ్ము. ప‌దే ప‌దే ఎన్నికలు నిర్వహించడం వల్ల పదే పదే విధులు నిర్వర్తించాల్సిన పరిపాలన, భద్రతా బలగాలు, ఉద్యోగులపై భారం పడుతోంది. ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కొంతమంది ఓటు వేయడానికి తమ ఇళ్లను వదిలి వెళ్ళలేరు.

ఈ ప్రతిపాదనను కొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రాంతీయ పార్టీలకు హాని చేస్తుందని వాదిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిబంధనను రద్దు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాఖ్య పాలనా వ్యవస్థను నాశనం చేసి రాష్ట్రపతి పాలనా విధానాన్ని అమలు చేసి బహుళ పార్టీల ప్రజాస్వామ్యం నుంచి దేశాన్ని ఒకే పార్టీ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది అతిపెద్ద సవాల్‌..?

వన్ నేషన్-వన్ ఎలక్షన్ సిస్టమ్ అమలులో అతిపెద్ద సవాలు. ఎందుకంటే రాజ్యాంగం, చట్టాలను మార్చవలసి ఉంటుంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. పదవీకాలం మిగిలి ఉన్న రాష్ట్ర అసెంబ్లీలు రద్దు చేయాలి. దీంతో పాటు ఈవీఎం, వీవీప్యాట్‌లు పెద్ద సవాల్‌గా మారనున్నాయి. దేశ జనాభా దాదాపు 140 కోట్లు. వీరిలో సగం మంది ఓటర్లు ఉన్నట్లయితే లోక్‌సభ, శాసనసభల ఏకకాల ఎన్నికలకు భారీగా మిష‌న్‌లు అవసరమవుతాయి.

ఈసారి 750 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయా?

ఒకే దేశం.. ఒకే ఎన్నికలతో పాటు 2029లో 543 లోక్‌సభ స్థానాలకు బదులుగా 750 స్థానాలకు ఎన్నికలు జరగవచ్చని అంచనా. వాస్తవానికి 2002 నాటి డీలిమిటేషన్ ప్రకారం.. 2026 వరకు లోక్‌సభ సీట్ల పెంపుపై నిషేధం ఉంది. 2027లో జనాభా గణన జరగాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో డీలిమిటేషన్ కూడా జరగవచ్చు. డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను నిర్ణయించడం. ఇదే జరిగితే జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లు పెరగడం ఖాయమ‌ని నిపుణులు అంటున్నారు.