Gulmarg Vs El Nino : గుల్మార్గ్.. కశ్మీర్‌లో మంచు అందాలకు కేరాఫ్ అడ్రస్. ఏటా చలికాలంలో ఇక్కడ మంచు కురుస్తుంటుంది. ఆ మంచు వల్ల గుల్మార్గ్ అందం రెట్టింపు అవుతుంటుంది. కానీ ఈ ఏడాది చలికాలంలో మంచు కురవలేదు. దీంతో ఇక్కడికి టూరిస్టుల రాక గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా ఎంతోమంది స్థానికులు ఉపాధిని కోల్పోయారు. హిమపాతం లేక గుల్మార్గ్ ప్రస్తుతం బోసిపోతోంది. అక్కడ ఇప్పుడు డ్రై స్పెల్ నడుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుల్మార్గ్.. ఎల్ఓసీకి అతి సమీపంలో ఉండే ప్రాంతం. ఇది పీర్ పంజల్ పర్వతాల పరిధిలో ఉంటుంది. కప్ షేప్‌లో ఉండే ఈ లోయ ప్రకృతి అందాలకు నెలవు. 2023లో 16.50 లక్షల మంది పర్యాటకులు గుల్మార్గ్ని సందర్శించారు. కానీ చలికాలంలో మంచుకురవక గుల్మార్గ్ డ్రైగా మారిపోయింది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఆ ప్రాంతంలో నేషనల్ వింటర్ గేమ్స్ జరగాల్సి ఉంది. మంచు సరిగ్గా లేకపోతే.. వింటర్ స్పోర్ట్స్‌తో పాటు స్కీయింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహణకు ఇబ్బందులు (Gulmarg Vs El Nino) ఎదురవుతాయి.
We’re now on WhatsApp. Click to Join.
సాధారణంగా ఏటా చలికాలంలో కశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుంటాయి. 40 రోజుల వింటర్ పీరియడ్ ఇక్కడ అతి కఠినంగా ఉంటుంది. ఈ స్థితిని స్థానికులు ‘ఛిల్లా-ఐ-కలాన్’ అని పిలుస్తారు. ఈసారి ఛిల్లా-ఐ-కలాన్ డిసెంబర్ 21 నుంచి జనవరి 31 వరకు ఉంటుంది. అయితే ఎల్ నినో ఎఫెక్ట్ వల్లే ఈసారి సరిగ్గా మంచు కురవడం లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. జనవరి 16 వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని చెబుతున్నారు. వాస్తవానికి గతేడాది నవంబర్ నుంచి ఈ ప్రాంతాన్ని ఎల్ నినో ఇబ్బంది పెడుతోంది. అంతకుముందు 2022, 2018, 2015 సంవత్సరాల్లోనూ గుల్మార్గ్‌లో ఎల్ నినో ఎఫెక్ట్ పడింది. కానీ ఆ టైంలోనూ మంచు బాగానే కురిసింది. ఈసారి మాత్రమే మంచు కురవడం లేదు.
Also Read: Indian Warships : 10 యుద్ధనౌకలు, అత్యాధునిక డ్రోన్లు రంగంలోకి.. ఎందుకు ?
హిమాలయాల్లో 11,800 అడుగుల ఎత్తులో..
హిమాలయాల్లో 11,800 అడుగుల ఎత్తులోని జోజిలా కనుమ కశ్మీర్‌ను లద్దాఖ్‌తో కలుపుతుంది. సాధారణంగా శీతాకాలంలో ఈ కనుమలో కనీసం 30 నుంచి 40 అడుగుల ఎత్తున మంచు పేరుకుంటుంది. సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌ఓ) ఈ కనుమ గుండా రవాణా సజావుగా సాగడానికి ఈ మంచును ఎత్తిపోసే పనిలో తలమునకలు అవుతుంది. కానీ, ఈ ఏడాది జోజిలాలో మంచు కేవలం ఆరేడు అడుగులే ఉండి బీఆర్‌ఓ పనిని సులభతరం చేసింది. కశ్మీర్‌లోని గుల్‌మార్గ్, పహల్‌గావ్‌లలో మంచు ఏమాత్రం లేకపోవడం స్కీయింగ్ చేయడానికి వచ్చే పర్యాటకులను, పర్యాటకంపై ఆధారపడిన స్థానికులను నిరాశపరచింది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నవంబరు, డిసెంబరులలో నాలుగు నుంచి ఆరడగుల ఎత్తున మంచు పేరుకునే చోట్ల ఈ సంవత్సరం అసలు అది మచ్చుకు కూడా కనిపించడం లేదు.