Nick Vujicic Success Story: నిక్ జయించాడు.. మీరూ జయించగలరు!

పరాజయాలకు జడిసి జీవితంనుంచి పారిపోవాలనుకున్నారా? అయితే మీరు నిక్ వాయ్ చిచ్ గురించి తెలుసుకోవాల్సిందే.

  • Written By:
  • Updated On - February 2, 2023 / 06:16 PM IST

👉 జీవితంలో ఏమీ సాధించలేనని మీకు ఎప్పుడైనా అనిపించిందా?
👉 అవసరమైనవి లేవని ఏనాడైనా బాధపడ్డారా?
👉 ఎవరో ఏదో అన్నారని ఏరోజైనా కుంగిపోయారా?
👉 పరాజయాలకు జడిసి జీవితంనుంచి పారిపోవాలనుకున్నారా?

అయితే మీరు నిక్ వుజిసిక్ (Nick Vujicic) గురించి తెలుసుకోవాల్సిందే. చేతులు కాళ్లు లేకున్నా మొండెంతోనే జీవితాన్ని జయించిన మొండి ధైర్యం అతని సొంతం. చిన్ననాటినుంచి అనేకమంది, అనేక సందర్భాల్లో, పలు విధాలుగా పరిహసించినా నిరాశచెందక, నిస్పృహకు లోనవ్వక, తన శారీరక వికలత్వాన్ని మనోబలంతో జయించిన విజేత నిక్ (Nick Vujicic). 17 సంవత్సరాలకే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, దాదాపు 60 దేశాల్లో పర్యటించి ఉపన్యసించిన ఘనుడు నిక్. తన జీవితాన్నే ఓ వ్యక్తిత్వ వికాస పాఠంగా మార్చాడు.

నిరాశ ఎదురైనప్పుడు నిక్ గురించి చదవండి

ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ విషయంలోనైనా మీకు నిరాశ ఎదురైనప్పుడు నిక్ గురించి చదవండి, అతని వీడియోలు చూడండి. నిరాశ పరారవుతుంది, మీకు జీవితంపట్ల ఆశ కలుగుతుంది, భవిష్యత్తు (Future) పట్ల భరోసా ఏర్పడుతుంది. నిక్ సాధించగా నేనెందుకు సాధించలేను అనిపిస్తుంది. నిక్ కోరుకునేదీ అదే. జీవితాన్ని జయించిన నిక్ ను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవడం మంచి విషయం. విద్య పట్ల జగన్ కమిట్మెంట్ ను నిక్ ప్రశంసించడం గొప్ప విషయం. జీవితంలో అసాధ్యానికి తావులేదని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణ అని ఇంటర్నేషనల్‌ మోటివేషనల్‌ స్పీకర్‌ (Motivational Speaker) నిక్‌ వుజిసిక్‌ పేర్కొన్నారు. అపజయాలకు ఎన్నడూ వెరవకూడదని సూచించారు. నిరంతరం శ్రమిస్తూ కష్టాలను అవలీలగా అధిగమించాలని చెప్పారు. కాళ్లు, చేతులు లేకుండా పుట్టిన తాను అధైర్యపడలేదని, జీవితంలో పట్టుదలతో అనుకున్నది సాధించగలిగానని తెలిపారు. తాను వక్తగా ఎదుగుతానని, పెండ్లి చేసుకొని నలుగురు పిల్లలకు తండ్రిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు.

పరిస్థితుల నుంచి ఎప్పుడూ పారిపోకూడదు

ఏది కావాలన్నా సొంతంగా సాధించుకోవాలన్న దృక్పథాన్ని తన తల్లిదండ్రులు అలవాటు చేశారని, కాళ్లు, చేతులు లేవని బాధపడుతూ కూర్చోకుండా దేవుడు ఇచ్చిన మెదడును ఉపయోగించుకోవడం ఎలాగో నేర్పారని (Nick Vujicic) వెల్లడించారు. అందువల్లే తాను ఇలా మీ ముందు నిల్చున్నానని పేర్కొన్నారు. ఆరేండ్లలోనే సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలని తన తల్లిదండ్రులు కండిషన్‌ పెట్టారని చెప్పారు. అయినా వెరవకుండా ఓ స్టోర్‌లో క్లీనింగ్‌ పనికి కుదిరానని, మెడతో వాక్యూమ్‌ క్లీనర్‌ను పట్టుకొని క్లీనింగ్‌ చేసి రెండు డాలర్లు సంపాదించేవాడినని చెప్పారు. ‘పరిస్థితుల నుంచి ఎప్పుడూ పారిపోకూడదు.. మీరు ఉత్తమంగా ఏంచేయగలరో అది చేయాలి. మీరు ఉన్నతంగా ఎదగాలంటే మీ వైఖరిని మార్చుకోవాలి. ఆటంకాలనే (Problems) అవకాశాలుగా మల్చుకోవాలి.

ఏదైనా కష్టపడి సాధించాల్సిందే

ఏ పనిలోనూ ఒక్కసారే పరిపూర్ణత రాదు. నిత్యం శ్రమిస్తూ ఉంటేనే ఎందులోనైనా పరిపూర్ణత వస్తుంది. వైఫల్యాలనే తరగతి గదిగా మార్చుకోవాలి’ అని ఉద్బోధ చేశారు. ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది మనకు లభించదని, అదే జీవితమని పేర్కొన్నారు. ఏదైనా కష్టపడి సాధించాల్సిందేనని చెప్పారు. షూ పాలిష్‌ చేసే గిరిజన తెగకు చెందిన తన స్నేహితుడు హడ్సన్‌ ఓసారి రోడ్డుప్రమాదంలో (Road Accident) గాయపడ్డాడని, డాక్టర్ల వల్ల బతికి బయటపడ్డాడని చెప్పారు. అదే సమయంలో అతడు వైద్యుడు కావాలని నిర్ణయించుకొన్నాడని తెలిపారు. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యంలేని అతడు అంచెలంచెలుగా పెద్ద డాక్టర్‌గా ఎదిగాడని వివరించారు. ప్రస్తుతం అమెరికాలో 150 దవాఖానలను స్థాపించాడని తెలిపారు. ఎవరు కూడా ఎవరి కన్నా తక్కువ కాదని, ఎక్కువ కూడా కాదని పేర్కొన్నారు. విద్యార్థులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిల్‌గేట్స్‌, స్టీవ్‌జాబ్స్‌లా ఎదిగితే సరిపోతుందని అనుకోవద్దని, అంతకు మించి సాధిస్తామని లక్ష్యంగా (Life Targets) పెట్టుకోవాలని సూచించారు.

Also Read: Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి కొత్త డిమాండ్.. అనుచర వర్గానికి పీసీసీ పోస్టులు?