Site icon HashtagU Telugu

New Notes: కొత్త రూ.100, రూ.200 నోట్లు.. పాత నోట్లను రద్దు చేస్తారా?

RBI

RBI

New Notes: నోట్లకు సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా సామాన్యుల‌కు భ‌యం ప‌ట్టుకుంటుంది. కొత్త నోట్ల రాకపై వార్తలు వస్తే పాత నోట్లను నిలిపివేస్తున్నారా అనే చర్చ కూడా జ‌నాల్లో మొదలైంది. కొత్త నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత పాత కరెన్సీ ఏమవుతుంది? 100, 200 రూపాయల నోట్లకు (New Notes) సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణ‌యం ఏంటీ అని అంద‌రిలో ప్ర‌శ్న‌లు మొద‌లవుతున్నాయి. త్వరలో కొత్త రూ.100, రూ.200 నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ నిన్న తెలిపింది.

ఇప్పుడు ఈ వార్త బయటకు రాగానే చర్చ మొదలైంది. పాత నోట్ల‌కు సంబంధించిన ప్రశ్న ప్రజల మదిలో పరిగెడుతోంది. పాత నోట్ల సంగతేంటి? అని సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొత్త నోట్లను ఆర్‌బీఐ విడుదల చేస్తుంది. ఉదాహరణకు మార్కెట్లో ఉన్న కరెన్సీ నోట్లు చాలా పాతవి అయి ఉండవచ్చు. నోట్ల డిజైన్ మొదలైనవి మార్చబడి ఉండవచ్చు లేదా కొన్ని నోట్లను చెలామణి నుండి తీసివేసి ఉండవచ్చు. డీమోనిటైజేషన్ సమయంలో ఇది క‌నిపించింది.

Also Read: Shubman Gill: గిల్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఐసీసీ!

రూ.100, రూ.200 నోట్లను విడుదల చేయడానికి గల కారణాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ నోట్ల డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయబోమని ఆర్‌బీఐ చెబుతోంది. ఆర్‌బీఐ గవర్నర్ సంతకంలో మాత్ర‌మే మార్పు జ‌ర‌గ‌నున్న‌ట్లు వివ‌రించింది. రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా ఇటీవ‌ల బాధ్యతలు స్వీకరించారు. అందుకోసం ఆయన సంతకంతో కూడిన కొత్త రూ.100, రూ.200 నోట్లను విడుదల చేయనున్నారు. ఇది సాధారణ ప్రక్రియ. ప్ర‌తిసారి కొత్త గవర్నర్ నియామకం తర్వాత అతని సంతకంతో నోట్స్ విడుద‌ల చేస్తున్నారు.

పాత నోట్ల పరిస్థితేంటి?

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న పాత నోట్లపై కొత్త నోట్ల రాక ప్రభావం ప‌డే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలోనే పాత రూ.100, రూ.200 నోట్లు చెల్లుబాటు అవుతాయని, డీమోనిటైజ్ చేయబోమని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. కొత్త నోట్లు త్వరలో ఏటీఎం మెషీన్లలోకి లోడ్ అవుతాయి. అంటే మరికొద్ది రోజుల్లో మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు రూ.100, రూ.200 కొత్త నోట్లు కూడా వస్తాయి.