Music Maestro Ilayaraja: సంగీత సామ్రాజ్యాధిపతికి వందనం

ఇళయరాజా...సంగీత ప్రియులకే కాదు సగటు తెలుగు సినిమా చూసే ప్రేక్షకునికి పరిచయం అవసరం లేని పేరు.

  • Written By:
  • Publish Date - July 7, 2022 / 07:15 AM IST

ఇళయరాజా…సంగీత ప్రియులకే కాదు సగటు తెలుగు సినిమా చూసే ప్రేక్షకునికి పరిచయం అవసరం లేని పేరు. తెలుగు పాటకు పండగ తెచ్చింది .. .. పరిమళాన్ని అద్దింది ఆయనే. తెలుగు పాటను తేనెలో ముంచి శ్రోతలకు అందించడంలో ఇళయరాజాను మించిన వారు లేరు. తన మధురమైన పాటలు ఇప్పటికీ అందరూ ఆస్వాదిస్తూనే ఉంటారు. బాధలో ఉన్న మనసు తేలిక పడాలంటే ఇళయరాజా… ఉత్సహంగా ఉండాలంటే ఇళయరాజా సంగీతం…
కేవలం తెలుగు మాత్రమే కాదు ఇతర భాషల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన బాణీలను ఇష్టపడనివారుండరంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. చక్కని అక్షరాలకు ఇళయరాజా సంగీతం తోడయితే కమ్మని భోజనమే.. అందుకే కోట్లాదిమంది పెదాలపై మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఇప్పటికీ నాట్యం చేస్తూనే ఉంటాయి. వేయికి పైగా చిత్రాలకు స్వరాలు సమకూర్చిన ఇళయరాజా నేటికీ అలుపుసొలుపు లేకుండా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ స్థాయికి చేరుకునే క్రమంలో ఆయన కూడా ఎన్నో కష్టాలు దాటి వచ్చారు.

పేద కుటుంబంలో జన్మించిన ఆయనకి ఆకలితో పడే బాధ తెలుసు. సంగీత దర్శకుడు జీకే వెంకటేశ్ దగ్గర సహాయకుడిగా కొంతకాలం పనిచేసిన ఇళయరాజా1976లో వచ్చిన అన్నక్కలి అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. అప్పటివరకూ ఉన్న సంగీత దర్శకులకు పూర్తి భిన్నమైన దారిలో ఆయన తన బాణీలను నడిపించారు. సాహిత్యంలోని భావ సౌందర్యం చెడకుండా, ఆ పదాలు సంగీత హోరులో కలిసిపోకుండా బాణీ కట్టడం ఆయనకే చెల్లింది. సంప్రదాయ బద్ధమైన సంగీతానికి పాశ్చాత్య సంగీతాన్ని జోడిస్తూ చేసిన ప్రయోగాలు ఇళయరాజాను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఎందరో గాయనీ గాయకులు ఆయన సంగీతం స్వరార్చనలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇప్పటి వరకూ వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ. కన్నడ, మరాఠీ భాషల్లో వెయ్యికి పైగా సినిమాలలో దాదాపు 5000కు పైగా పాటలకు బాణీలందించారు. ఆయన సంగీతంవల్లే చాలా సినిమాలు విజయాన్ని సాధించాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పాటలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో నేపథ్య సంగీతానికీ అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు.
శ్రీరామరాజ్యం, సాగర సంగమం, సీతకోక చిలుక, రుద్రవీణ, జెంటిల్ మేన్, కిల్లర్, అభినందన, ఘర్షణ, ఛాలెంజ్, వంటి ఎన్నో మరిచిపోలేని సినిమాలకు సంగీతాన్ని అందించారు.
ఇళయరాజా ప్రతిభా పాటవాలకు పద్మభూషణ్ , పద్మవిభూషణ్ వరించాయి. ఆయన సంగీతంలోని గొప్పతనం గురించి చెప్పేందుకు రోజులు సరిపోవు…ఆ పాటల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించడమే ఎల్…ఆయన సంగీత సామ్రాజ్యంలో విహరించడమే.ఇళయరాజా మన దేశంలో పుట్టడం భారతీయ సంగీత అభిమానులు , సినీ ప్రేక్షకులు చేసుకున్న గొప్ప అదృష్టమని ఎన్నో సందర్భాల్లో చాలా మంది చెప్పిన మాటలు ఎవరైనా అంగీకరించాల్సిందే. అలాంటి మహోన్నత వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయడం అందరూ హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఇళయరాజాకు సంగీత ప్రియులు, ప్రేక్షకుల తరపున శుభాకాంక్షలు చెబుదాం.