Delhi Fire Heros:భగ భగ మంటల్లో .. ఉదయించిన రక్షకులు.. ఢిల్లీ అగ్ని ప్రమాద ఘటనలో ఎంతోమందిని కాపాడిన హీరోలు వీరే!!

చుట్టూ మంటలు.. దట్టమైన పొగలు.. ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యే భయానక స్థితి !! ఇలాంటి పరిస్థితిలో ప్రాణమో రామచంద్ర అంటూ ఉరుగులు పరుగులు తీయడమే తరుణోపాయంగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - May 15, 2022 / 01:40 PM IST

చుట్టూ మంటలు.. దట్టమైన పొగలు.. ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యే భయానక స్థితి !! ఇలాంటి పరిస్థితిలో ప్రాణమో రామచంద్ర అంటూ ఉరుగులు పరుగులు తీయడమే తరుణోపాయంగా ఉంటుంది. అయినా కొందరు ప్రాణాలకు తెగించి, కార్చిచ్చు మధ్య నిలిచి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా. మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. భగభగ మండే ఆ మంటల నడుమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరితపిస్తూ ఉరుకులు పరుగులు తీస్తున్న వారిని కాపాడేందుకు.. కొందరు రక్షకులు ఉదయించారు. మంటలకు తగలబడిపోతున్న ఆ బిల్డింగ్ లో ఉండే ఒక్కో నిమిషం ఆయువును తగ్గించేస్తుందని తెలిసినా వారు వెరువలేదు. రక్షణ చర్యల్లో భాగంగా బిల్డింగ్ దగ్గరికి వచ్చిన క్రేన్ లోకి ఎంతోమంది మహిళలు, పిల్లలు, వృద్దులను ఎక్కించి కాపాడారు. ఈ సాహసాన్ని చూపిన కొందరు హీరోల అనుభవాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరుగురు పిల్లల్ని కాపాడిన మమతా దేవి

ఆమె పేరు మమతాదేవి. వయసు 52 ఏళ్ళు. 8 రోజుల క్రితమే ఢిల్లీ లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. భర్త వికలాంగుడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మమతాదేవి పనిచేస్తే కానీ ఇల్లు గడవదు. అయినా .. బిల్డింగ్ లో మంటలు వ్యాపిస్తున్న క్రమంలో ఆమె ఎనలేని సాహసం చూపించింది. క్రేన్ వచ్చి నిలబడగానే.. నేను ముందు, నేను ముందు అంటూ అందరూ ఆగమాగం పరుగులు తీశారు. కానీ మమతాదేవి తన ఇద్దరు పిల్లల్లాగే అక్కడున్న పిల్లల్ని భావించి.. వారిని రక్షించాలని డిసైడ్ అయ్యింది. ఆ ఫ్లోర్ లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి జాగ్రత్తగా క్రేన్ లో దింపింది. ఈక్రమంలో మంటల ధాటికి ఆమె కాళ్ళు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలను అందరినీ క్రేన్ లోకి దింపిన తర్వాత ఆమె కిటికీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంది.

అవినాష్.. శభాష్

అవినాష్ 27 ఏళ్ల కుర్రాడు. ఆ ఫ్యాక్టరీ లో ఏడాదిగా పని చేస్తున్నాడు. అగ్ని ప్రమాదం వల్ల భవనంలోని రెండో అంతస్తులో మీటింగ్ హాల్ లో చిక్కుకుపోయిన ఎంతోమందిని కాపాడిన సాహసి అవినాష్. వాస్తవానికి మీటింగ్‌ జరుగుతుండగా క‌రెంట్ పోయింది. ఆ వెంటనే మీటింగ్ హాల్ లో చీకటి అలుముకుంది .పొగ‌లు వ్యాపించాయి.ఈ తరుణంలో అవినాష్ కొంతమందిని తనతో తీసుకెళ్లి అర్ధ గంట తీవ్రంగా ప్రయత్నించి .. మీటింగ్ హాల్ కు ఉన్న ఒకే ఒక ఎగ్జిట్ డోర్ అద్దాలు పగులగొట్టాడు. దీంతో మీటింగ్ హాల్ లోని దాదాపు 50 మంది బయటికి వచ్చేటందుకు మార్గం సుగమం అయింది.

స్వార్ధంగా ఆలోచించలేకపోయా.. అందుకే ఇతరులను ఆదుకున్నా

పొగ కమ్మేయడంతో కొందరు.. భయోద్రిక్తులై ఇంకొందరు.. గాయాలపాలై ఇంకొందరు స్పృహ కోల్పోయారు. ఇలాంటి వారికి ఆసరాగా నిలిచాడు వినీత్ కుమార్ అనే మరో వ్యక్తి. వారిని మంటలకు దూరంగా జరిపాడు. అనంతరం వాళ్ళు స్పృహలోకి రాగానే బిల్డింగ్ నుంచి క్రేన్ లోకి ఎక్కించాడు. ఇలా ఎంతోమంది ప్రాణాలను వినీత్ కాపాడాడు. ”ఇతరుల ప్రాణాలు అపాయంలో ఉన్నపుడు.. వారిని వదిలి వెళ్లడం న్యాయం కాదు అనిపించింది. అందుకే అక్కడే నిలబడి ఇతరులకు సాయం చేశా” అని వినీత్ వివరించాడు.

ఎంత మంది చనిపోయారు?

ఈ భారీ అగ్నిప్రమాదంలో 29 మంది మరణించారు. 25 మంది మృత‌దేహాలు గుర్తించ‌లేని స్థితిలో ఉన్న‌ట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీటి గుర్తింపున‌కు డీఎన్ఏ శాంపిళ్ల‌ను ఫోరెన్సిక్ అధికారులు సేక‌రించార‌ని వెల్లడించారు. డీఎన్ఏ టెస్టుల అనంత‌రం మృత‌దేహాల‌ను వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గిస్తామ‌న్నారు . మరో 29 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరిలో 24 మంది మ‌హిళ‌లతో పాటు ఐదుగురు పురుషులు ఉన్నారు. మొత్తం 14 మంది గాయ‌ప‌డ‌గా, 13 మందికి చికిత్స అందించి డిశ్చార్జి చేసిన‌ట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్ర‌మాదం సంభ‌వించిన థ‌ర్డ్ ఫ్లోర్‌లో మొత్తం 250 నుంచి 300 మంది ఉన్నారు. 24 ఫైరింజిన్లు సుదీర్ఘంగా శ్రమించి మంటలను ఆర్పాయి. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ను సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.