Site icon HashtagU Telugu

Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క కుంకుమ భరిణెగా ఎందుకు మారారు ?

Medaram Jatara 2024

Medaram Jatara 2024

Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర .. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర.  ఈ జాతర ములుగు జిల్లాలో వచ్చే నెలలో జరగనుంది. ఈ మహాజాతరలో వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే ముందు భక్తులు గట్టమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మేడారం బాట పడతారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, పసుపు, కుంకమలు, గాజులు, చీర సారె వనదేవతలకు సమర్పిస్తారు. బంగారాన్ని(బెల్లం) కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే మేడారానికి భక్తుల రాక మొదలైంది.  రోజూ లక్షమందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి మండలం మేడారం దట్టమైన అడవుల్లో ఈ ఉత్సవాలు(Medaram Jatara 2024) నిర్వహిస్తుంటారు. పూర్వం కరువు సమయంలో తమకు తోడుగా వచ్చిన వన దేవతలుగా అమ్మవార్లను స్థానిక ప్రజలు పూజిస్తుంటారు.

పూర్వ గాథ ఇదీ.. 

స్థలపురాణం ప్రకారం.. 13వ శతాబ్దంలో  కప్పం కట్టాలంటూ కాకతీయ రాజులు మేడారం ప్రాంత  ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవారు. చివరకు కప్పం కోసం కాకతీయ రాజులు మేడారం ప్రాంతంపై యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో కాకతీయుల సైన్యంతో పోరాడుతూ… సారలమ్మ, నాగమ్మ అమరులవుతారు. ఇక యుద్ధంలో పరాభవాన్ని తట్టుకోలేక జంపన్న ఆత్మహత్య చేసుకుంటారు. ఈ క్రమంలో కాకతీయ సైన్యంపై వీరోచితంగా పోరాటం చేసిన అనంతరం సమ్మక్క సైతం చిలకలగుట్ట అనే ప్రాంతం వైపు వెళ్తారు. అలా వెళ్తూ ఆమె అకస్మాత్తుగా అంతర్ధానమవుతారు.  ఈ క్రమంలో ఆమె జాడ కోసం స్థానికులు వెతకగా.. ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమ భరిణె కనిపించాయి. ఆనాడు దొరికిన పసుపు, కుంకుమ భరిణెనే సమ్మక్కగా భావించారు. ఆ ఘటన జరిగిన నాటి నుంచే మాఘశుద్ధ పౌర్ణమి వేళ సమ్మక్క- సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నారు. చిలకల గుట్టలో ఉన్న సమ్మక్క తల్లిని గద్దెపైకి పూజారులు తీసుకొస్తారు. సమ్మక్క తల్లికి ప్రభుత్వ లాంఛనాలతో  అధికారులు, మంత్రులు ఆహ్వానం పలుకుతారు. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా పోలీసు అధికారి గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. అమ్మకు గౌరవ వందనం సమర్పిస్తారు.

Also Read :Rs 2500 To Women : ఫిబ్రవరి నుంచి ఆ రెండు స్కీమ్స్ అమల్లోకి

మేడారం జాతరకు వెళ్లే జాతీయ రహదారి 163 పక్కనే ములుగు శివారులో ఉన్న గట్టమ్మ దేవాలయం వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పార్కింగ్‌, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, విడిది కేంద్రాలు, మినీ వాటర్‌ ట్యాంకులు, స్నానపు గదులు, నిరంతర విద్యుత్తు,  సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి  పోలీసు అధికారి ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ, ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి.