Marriage: పెళ్లి చేసుకున్న వాళ్లకు 30 రోజులు పెయిడ్ లీవ్స్

జననాల రేటును మళ్లీ పెంచడానికి చైనాలోని కొన్ని ప్రావిన్స్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

జననాల రేటును మళ్లీ పెంచడానికి చైనాలోని కొన్ని ప్రావిన్స్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్తగా పెళ్లి (Marriage) చేసుకున్న జంటలకు 30 రోజుల పాటు పెయిడ్ లీవ్స్ ఇచ్చే నిబంధనను అమల్లోకి తెచ్చాయి. చైనా వాయవ్య ప్రావిన్స్ లు ‘గన్సు’ ‘షాంగ్సీ’ ఇప్పుడు 30 రోజుల పెయిడ్ మ్యారేజ్ లీవ్స్ ను అమల్లోకి తెచ్చాయి. ప్రస్తుతానికి షాంఘై ప్రావిన్స్ 10 రోజులు, సిచువాన్ 3 రోజుల పాటు ఈ లీవ్స్ ఇస్తున్నాయి.

అయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే ఇలాంటి మరొక నిర్ణయాన్ని చైనా ప్రభుత్వం తీసుకుంది. సంతానోత్పత్తి చికిత్సల ఖర్చును భరిస్తామని వెల్లడించింది. జాతీయ బీమా పథకం కింద ఉచిత సంతానోత్పత్తి చికిత్సలను అందిస్తామని తెలిపింది. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న జంటలకు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART), ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) వంటి సంతానోత్పత్తి చికిత్సల ఖర్చులను భరించేందుకు తమ కవరేజీని విస్తరింపజేస్తామని చైనా నేషనల్ హెల్త్‌కేర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. షాంఘై వంటి నగరాల్లో సంతానోత్పత్తి చికిత్సకు సగటున రూ.4 లక్షలు దాకా ఖర్చు అవుతోంది. 2021 నాటికి చైనాలో ART చికిత్స చేసే వైద్య సంస్థల సంఖ్య 539. ఇవి ఏటా 10 లక్షల మందికిపైగా వ్యక్తులకు IVF ట్రీట్మెంట్ చేస్తున్నాయి.

ఈ ఏడాది జనవరిలోనే చైనాలోని  సిచువాన్ ప్రావిన్స్‌లో జంటలు తమకు నచ్చినంత మంది పిల్లలను కలిగి ఉండటానికి అనుమతి ఇచ్చారు. కొత్త విధానం ప్రకారం, పెళ్లికాని (Marriage) జంటలు కూడా పిల్లలను కనడానికి మరియు పెంచడానికి అర్హులు.ఇంతకు ముందు ఒంటరి మహిళలు బర్త్ రిజిస్టర్ చేసుకోకుండా నిషేధం ఉండేది. ఇప్పుడు అది లేదు. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్.. 2022లో 1.41175 బిలియన్ల జనాభాతో పోలిస్తే సుమారు 8.50 లక్షల పాపులేషన్ తగ్గుదలని నివేదించింది. ఇది 1961 తర్వాత చైనాలో మొట్టమొదటి జనాభా క్షీణత. 2050 నాటికి చైనా జనాభా 109 మిలియన్లకు తగ్గుతుందని UN నిపుణులు అంచనా వేశారు.

“వన్ చైల్డ్” పాలసీతో దెబ్బ:

చైనా 1980 నుంచి 2015 వరకు “వన్ చైల్డ్” పాలసీ కఠినంగా అమలు చేసింది. దీనివల్లే ఆ దేశంలో జనాభా తగ్గింది. దీంతో 2015లో ఆ పాలసీని రద్దు చేసింది. 2022లో చైనా జననాల రేటు బాగా తగ్గిపోయి 1,000 మందికి 6.77కు చేరింది. దీని ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడిందని నిపుణులు అంటున్నారు.

Also Read:  టెక్స్ట్ చేయడం ఇష్టం లేదా? త్వరలో ChatGPT మీకోసం WhatsApp మెసేజ్ లు పంపుతుంది